Chandrababu

Chandrababu: ఏపీ ఖజానాకు కాసుల వర్షం..!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు ఆదాయ వృద్ధి రూపంలో శుభవార్త అందింది! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 23 నాటికి స్పెషల్ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి వచ్చిన రూ.62,604 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా రూ.11,738 కోట్లు (18.7 శాతం) అధికం కావడం విశేషం. రాష్ట్ర వార్షిక ఆదాయ లక్ష్యం రూ.1,27,506 కోట్లు కాగా, నవంబర్ 23 నాటికే అందులో 58 శాతం మేర లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంది. బుధవారం (నవంబర్ 25, 2026) అమరావతిలో ఆదాయార్జన శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించగా, అధికారులు ఈ కీలక గణాంకాలను వివరించారు.

ఈ సమీక్షలో వెల్లడైన వివరాల ప్రకారం, రాష్ట్రంలో పన్ను ఆదాయం 18.8 శాతం వృద్ధితో రూ.53,692 కోట్ల నుంచి రూ.63,796 కోట్లకు (రూ.10,104 కోట్ల పెరుగుదల) చేరగా, పన్నేతర ఆదాయం (Non-tax revenue) ఏకంగా 31.3 శాతం ఎగబాకి రూ.1,330 కోట్ల నుంచి రూ.2,091 కోట్లకు చేరింది. ఇక ప్రధాన శాఖల వారీగా చూస్తే, ఎక్సైజ్ శాఖ స్పెషల్ మార్జిన్‌తో కలిపి అత్యధికంగా రూ.20,083 కోట్లు (19.6% వృద్ధి, రూ.3,287 కోట్ల అదనపు ఆదాయం) సమకూర్చింది.
స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 16.6 శాతం వృద్ధితో రూ.8,020 కోట్లు, వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 18.3 శాతం వృద్ధితో రూ.5,917 కోట్లు (ఇందులో జీఎస్టీ వసూళ్లు 18.1 శాతం పెరిగి రూ.3,694 కోట్లకు చేరాయి) ఆదాయం లభించింది. అలాగే వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు 17.3 శాతం వృద్ధితో రూ.3,649 కోట్లు, గనులు మరియు భూగర్భ శాఖకు 13.2 శాతం వృద్ధితో రూ.2,086 కోట్లు, అటవీ శాఖకు 22.3 శాతం వృద్ధితో రూ.22 కోట్ల రాబడి వచ్చింది. స్థానిక సంస్థల విషయానికొస్తే, ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 మధ్య గ్రామ పంచాయతీలు రూ.238 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలు ఆస్తిపన్ను రూపంలో రూ.2,365 కోట్లు వసూలు చేశాయి.
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలపై ఎలాంటి కొత్త పన్నుల భారం మోపకుండా, ఛార్జీలు పెంచకుండానే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం, ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకత పెంచడం వల్లే ఈ స్థాయిలో ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ప్రభుత్వ రాబడిలో స్పష్టంగా కనిపించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా పన్ను ఎగవేతలను అరికట్టి, ఆదాయ లీకేజీలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని రంగంలోకి దించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను వసూళ్లను పర్యవేక్షించేందుకు ఏఐ టూల్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు సీఎం తెలిపారు. అంతేకాకుండా, వాణిజ్య పన్నుల శాఖలోని నాలుగు విభాగాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఏఐ స్టాక్ వినియోగిస్తున్నామని, పన్ను రిటర్నుల పరిశీలన, ఆడిట్, క్షేత్రస్థాయి తనిఖీలు, న్యాయపరమైన వ్యవహారాల్లో ఈ టెక్నాలజీ అద్భుత ఫలితాలను ఇస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *