Blood Sugar Levels: మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి ప్రతిరోజూ ఎదురయ్యే అతిపెద్ద సందేహం ఆహార నియమాలు. ముఖ్యంగా పోషకాల గని అయిన కోడిగుడ్లు (Eggs) తినవచ్చా, లేదా? తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయా అనే అపోహలు చాలామందిలో ఉంటాయి. అయితే, డయాబెటిస్ ఉన్నవారికి కోడిగుడ్లు అత్యుత్తమ పోషకాహార ఎంపికని, వీటిలో కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) చాలా తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA) సూచించే దాదాపు అన్ని డైట్ ప్లాన్లలో (వేగన్ డైట్ మినహా) కోడిగుడ్లకు కచ్చితంగా స్థానం ఉంటుంది.
ఒక కోడిగుడ్డులో ఉండే పోషకాలు ఏమిటి?
ఒక పెద్ద సైజు (గ్రేడ్-A) కోడిగుడ్డులో శరీరానికి అవసరమైన కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి..
ప్రోటీన్: 6.2 గ్రాములు
కొవ్వు (Fat): 5 గ్రాములు (ఇది ప్రధానంగా పచ్చసొనలో ఉంటుంది; తెల్లసొనలో కొవ్వు దాదాపు సున్నా)
కార్బోహైడ్రేట్లు: కేవలం 0.5 గ్రాములు మాత్రమే
కోడిగుడ్డులోని పచ్చసొనలో విటమిన్-సి మినహా దాదాపు అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. రోజుకు రెండు గుడ్లు తినడం ద్వారా శరీరానికి కావాల్సిన రోజువారీ విటమిన్ అవసరాల్లో 10% నుంచి 30% వరకు సులభంగా పొందవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం & గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)..
మనం తీసుకునే ఆహారం గ్లూకోజ్‌గా మారి శరీరానికి శక్తినిస్తుంది. వైట్ రైస్, బ్రెడ్, పాస్తా, స్వీట్లు వంటి హై-గ్లైసెమిక్ ఇండెక్స్ (GI 70 కంటే ఎక్కువ) ఆహారాలు తిన్న వెంటనే బ్లడ్ షుగర్‌ను అమాంతం పెంచేసి, ఆ తర్వాత ఒక్కసారిగా నీరసాన్ని కలిగిస్తాయి.
కానీ కోడిగుడ్డు లో-గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI – 55 కంటే తక్కువ) కేటగిరీలోకి వస్తుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు అతి తక్కువగా ఉండటం వల్ల షుగర్ స్పైక్స్ రాకుండా రోజంతా నిలకడైన శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడంలోనూ గుడ్లు సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
డయాబెటిస్ నియంత్రణకు ఆహార సూచనలు..
మధుమేహ బాధితులు తమ ఆహారంలో పిండి పదార్థాలు, చక్కెరలను తగ్గించుకుని, ఫైబర్, లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.
-
తినదగినవి (Low GI): కోడిగుడ్లు, బాదం, ఆపిల్స్, బ్రోకలీ, పప్పుధాన్యాలు, ఓట్స్ (తీయదనం లేనివి), ఆకుకూరలు, స్టార్చ్ లేని కూరగాయలు.
-
మితంగా తీసుకోవాల్సినవి (Medium GI – 56 నుండి 69): బ్రౌన్ రైస్, అరటిపండు, బంగాళదుంపలు, గోధుమలు.
-
దూరంగా ఉండాల్సినవి (High GI – 70+): వైట్ రైస్, మైదా ఉత్పత్తులు, వైట్ బ్రెడ్, శీతల పానీయాలు (సోడాలు), కార్న్ ఫ్లేక్స్.
గమనిక: మధుమేహంతో పాటు గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు తమ రోజువారీ డైట్లో ఎన్ని గుడ్లు చేర్చుకోవాలనే దానిపై వ్యక్తిగత వైద్యులు లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.
