NSG Commandos

NSG Commandos: ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమాండోలకు సరికొత్త యూనిఫామ్‌.. ‘నైకో’ ఫ్యాబ్రిక్‌తో ఊరట!

NSG Commandos: దేశంలోని అత్యంత కీలకమైన వీఐపీలు, రాజకీయ ప్రముఖులకు రక్షణ కవచంలా నిలిచే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) ‘బ్లాక్ క్యాట్’ కమాండోల డ్రెస్ కోడ్‌లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా కమాండోలు శారీరక అలసటకు గురవుతుండటంతో వారికి సరికొత్త “బ్రీతబుల్ (గాలి ప్రసరించే)” యూనిఫామ్‌ను అందించాలని ఎన్‌ఎస్‌జీ హెడ్‌క్వార్టర్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గత ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతలో ఉన్న ఓ కమాండో విపరీతమైన ఎండలకి తాళలేక స్పృహతప్పి పడిపోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ మార్పు దిశగా వేగంగా అడుగులు పడ్డాయి.
విజయవాడలో ఏం జరిగింది? ఆ కమాండో ఎందుకు కుప్పకూలారు?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సమయం (ఏప్రిల్)లో విజయవాడలో ఈ ఘటన జరిగింది.
ఆ రోజు విజయవాడలో ఏకంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా.. ఆయన వెనకాలే క్లోజ్ ప్రొటెక్షన్‌లో నిలబడిన ఎన్‌ఎస్‌జీ కమాండో ఎండవేడిమి, హీట్‌స్ట్రోక్ (వడదెబ్బ)తో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న ఇతర సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను కిందపడకుండా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
నల్లటి దుస్తులు ధరించడం, వాటిపై 6 కేజీల బరువుండే బులెట్‌ప్రూఫ్ జాకెట్, తలపై బ్లాక్ టోపీ (బెరెట్), నడుముకు తుపాకులు, కమ్యూనికేషన్ సెట్లు ధరించి గంటల తరబడి ఎండలో నిలబడటంతో శరీరం తీవ్ర ఒత్తిడికి గురై ఆయన స్పృహ తప్పినట్లు వైద్యులు తేల్చారు.
నల్ల దుస్తులతో సమస్యేంటి? కొత్తగా వస్తున్న ‘నైకో’ స్పెషాలిటీ..
సాధారణంగా నలుపు రంగు ఎండను, వేడిని వేగంగా గ్రహించి లోపలే నిలిపివేస్తుంది. సంప్రదాయ బ్లాక్ ఓవరాల్స్ సైకలాజికల్ ఇంపాక్ట్ కోసం బాగున్నప్పటికీ, ఎండలు మండుతున్న సమయంలో కమాండోల శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి అస్సలు అవకాశం ఇవ్వవు. దీంతో సీఆర్‌పీఎఫ్ కోబ్రా (CoBRA) బెటాలియన్లు అడవుల్లో అధిక తేమ, వేడి వాతావరణంలో వినియోగించే ‘నైకో’ (Nyco – నైలాన్, కాటన్ మిశ్రమం) ఫ్యాబ్రిక్‌ను ఎన్‌ఎస్‌జీ ఎంపిక చేసింది.
ఈ ఫాబ్రిక్ కమాండోల శరీరానికి గాలి బాగా తగిలేలా చేస్తుంది. చెమట, తేమను సులభంగా బయటకు పంపి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. పైగా దృఢంగా ఉంటూ కమాండోలకు అవసరమైన డార్క్ రంగును కూడా నిలుపుతుంది. అంతర్గత ట్రయల్స్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి.

 

2027 ఎన్నికల ప్రచారానికి సిద్ధం – 9 మంది ప్రముఖులకు జడ్-ప్లస్ భద్రత:

వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికి ఈ కొత్త యూనిఫామ్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ 12, 14 స్పెషల్ రేంజర్ గ్రూపులు దేశవ్యాప్తంగా 9 మంది ప్రముఖులకు ‘జడ్-ప్లస్’ (Z-plus) భద్రత కల్పిస్తున్నాయి..
  1. నారా చంద్రబాబు నాయుడు (ఏపీ సీఎం)
  2. యోగి ఆదిత్యనాథ్ (యూపీ సీఎం)
  3. రాజ్‌నాథ్ సింగ్ (కేంద్ర రక్షణ మంత్రి)
  4. లాల్ కృష్ణ అద్వానీ (బీజేపీ కురువృద్ధుడు)
  5. మాయావతి (బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం)
  6. సర్బానంద సోనోవాల్ (కేంద్ర షిప్పింగ్ మంత్రి)
  7. రమణ్ సింగ్ (ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం)
  8. గులాం నబీ ఆజాద్ (జేకే మాజీ సీఎం)
  9. ఫారూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *