Varanasi

Varanasi: కుంభకర్ణుడు మళ్లీ పుడితే.. మహేష్ బాబు ఎదురుకుంటాడా..?.. వైరల్ అవుతున్న క్రేజీ థియరీ..!

Varanasi: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో పౌరాణిక కథలను బేస్ చేసుకొని వస్తున్న సినిమాలకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమా ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మైలురాయికి చేరువవడంతో, రామాయణ ఘట్టాలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇదే సమయంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్ఠాత్మక సినిమా ‘వారణాసి’ (Varanasi) కథ పైన కూడా ఆసక్తికర కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడ్డిట్ (Reddit) వేదికగా ప్రచారంలోకి వచ్చిన ఓ సరికొత్త ఫ్యాన్ థియరీ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ – కుంభకర్ణుడి పునర్జన్మ?

ఈ వైరల్ థియరీ ప్రకారం.. ‘వారణాసి’ సినిమాలో మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ అనే ప్రతినాయక పాత్రకు రామాయణంలోని కుంభకర్ణుడితో లోతైన సంబంధం ఉంటుందట. కుంభకర్ణుడు ప్రస్తుత యుగంలో కుంభగా మళ్లీ పుడతాడు అని అందులో ఉంది. పూర్వజన్మలో తన సోదరుడైన రావణాసురుడికి చెందిన శక్తివంతమైన ‘నవరత్న హారం’ను తిరిగి దక్కించుకోవడమే కుంభ ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. రామ–రావణ యుద్ధ సమయంలో చెల్లాచెదురై ప్రపంచంలోని వివిధ ఖండాల్లో దాగి ఉన్న ఆ తొమ్మిది రత్నాలను సేకరించడానికి కుంభ ఒక భారీ వ్యూహం రచిస్తాడని నెటిజన్లు ఊహిస్తున్నారు.

రత్నాల వేటలో ‘రుద్ర’.. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్..

ఈ థియరీ కథనం ప్రకారం, ఆ నవరత్నాలను ప్రపంచ నలుమూలల నుంచి వెతికి తెచ్చే సాహసోపేత బాధ్యతను మహేశ్ బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు కుంభ అప్పగిస్తాడట. దీనివల్ల రుద్ర వివిధ దేశాలు, విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గతంలో విడుదలైన ‘వారణాసి’ కాన్సెప్ట్ వీడియోలు, పోస్టర్లలో కనిపించిన ఆఫ్రికా, అంటార్కిటికా వంటి అంతర్జాతీయ నేపథ్యాలు ఈ నవరత్నాల అన్వేషణతో ముడిపడి ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టైమ్ ట్రావెల్ ట్విస్ట్ – వార్మ్‌హోల్ ద్వారా త్రేతాయుగానికి!

ఈ స్టోరీ థియరీలో అత్యంత ఆసక్తికరమైన అంశం టైమ్ ట్రావెల్ (Time Travel). రత్నాలన్నీ ఒక్కచోట చేరితే జరిగే పెను విపత్తును గుర్తించిన రుద్ర, వాటిని కాపాడేందుకు ఓ వార్మ్‌హోల్ (Wormhole) ద్వారా నేరుగా త్రేతాయుగానికి.. అంటే అసలైన రామాయణ కాలానికి చేరుకుంటాడని ప్రచారం సాగుతోంది. అక్కడ రాముడు–రావణుడి మధ్య యుద్ధం జరిగే కీలక సమయంలో రుద్ర జోక్యం చేసుకుంటాడని, చరిత్రను మార్చడం ద్వారా వర్తమానంలో ఆ నవరత్నాల ప్రభావాన్ని నియంత్రిస్తాడని నెటిజన్లు రాసుకొచ్చారు.

రాముడిగా మహేశ్ బాబు ఎపిసోడ్..

సినిమాలో మహేశ్ బాబు రాముడి అవతారంలో కనిపించే పౌరాణిక ఘట్టం ఇప్పటికే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక ఎపిసోడ్ కోసం రాజమౌళి దాదాపు 60 రోజుల చిత్రీకరణ సమయాన్ని కేటాయించారని, మహేశ్ బాబు సైతం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ నవరత్నాలు, కుంభకర్ణుడి పునర్జన్మ అంశాలన్నీ కేవలం అభిమానులు అల్లిన ఊహాగానాలు మాత్రమే. దర్శకుడు రాజమౌళి వెండితెరపై ఎలాంటి విజువల్ వండర్‌ను ఆవిష్కరించనున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమాపై సోషల్ మీడియాలో క్రేజీ స్టోరీ థియరీ వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్ర రావణుడి నవరత్నాల కోసం చూస్తుందని, మహేశ్ బాబు వార్మ్‌హోల్ ద్వారా త్రేతాయుగానికి టైమ్ ట్రావెల్ చేసి రామాయణ యుద్ధ సమయంలో జోక్యం చేసుకుంటాడని నెటిజన్లు కథనాలు అల్లుతున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియా ఊహాగానాలు మాత్రమే కాగా, అసలైన కథను రాజమౌళి ఎలా చూపించనున్నారనేది అధికారిక అప్‌డేట్స్ వచ్చేవరకు సస్పెన్సే.

varanasi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *