Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన తాజా సినిమా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహాశక్తి’) బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. దాదాపు ₹100 కోట్ల మార్కెట్ లక్ష్యంతో, భారీ ప్రచారంతో బరిలోకి దిగిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. స్టార్ ఇమేజ్, పండుగ సెలవులు ఉన్నప్పటికీ థియేటర్లకు జనం రాకపోవడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
ఆలయాల సందర్శన, చీరల పంపిణీ.. ప్రచారాలు భారీగా ఉన్నా కదలని బాక్సాఫీస్..
సినిమా విడుదల సందర్భంగా మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. ఎప్పుడు ప్రచారానికి రాని నయనతార ఈసారి స్వయంగా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి, మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
కొవిడ్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలై తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా ఘనవిజయం సాధించిన మొదటి భాగానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. అయితే ఈ సీక్వెల్‌ను ప్రముఖ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించారు. దునియా విజయ్, రెజీనా కసాండ్రా ప్రతినాయక పాత్రలు పోషించారు. అయితే మొదటి భాగంలో ఉన్న వ్యంగ్యం, సామాజిక సందేశం, హాస్యం ఈ సీక్వెల్లో మిస్ అవ్వడంతో పాటు రొటీన్ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఓపెనింగ్ వీకెండ్లో కనీసం ₹10 కోట్లు కూడా దాటని కలెక్షన్లు..
దీపావళి పండుగ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా గట్టి షాక్ ఇచ్చింది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ముగిసినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 10 కోట్ల మార్కును కూడా దాటలేకపోయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు వెర్షన్ ‘మహాశక్తి’తో పాటు తమిళంలోనూ థియేటర్లు వెలవెలబోతున్నాయి. పండుగ రోజుల్లో కూడా ఆక్యుపెన్సీ 20-30 శాతానికి మించకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
పాతచింతకాయ కథనం – ఏఐ, పేలవ వీఎఫ్ఎక్స్పై విమర్శలు..
సినిమాలో నయనతార ఒకవైపు దైవిక అమ్మవారిగా, మరోవైపు జర్నలిస్టుగా ద్విపాత్రాభినయం (డబుల్ రోల్) చేసినప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఎపుడో 90స్ లలో వాడే రొటీన్ ఫార్ములా సన్నివేశాలు, స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి.
సినిమాలో మితిమీరిన కృత్రిమ మేధ (AI) విజువల్స్, పేలవమైన గ్రాఫిక్స్ (VFX) సినిమా నాణ్యతను దెబ్బతీశాయంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కనీస సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడంలో సాంకేతిక విభాగం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేడీ సూపర్ స్టార్‌గా భారీ పారితోషికం తీసుకుంటూ తిరుగులేని మార్కెట్ ఉన్న నయనతార కెరీర్లో ‘మహాశక్తి/మూకుత్తి అమ్మన్ 2’ ఫలితం ఊహించని పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. కంటెంట్‌లో బలం లేకపోతే ఎంతటి స్టార్ పవర్ అయినా సినిమాను గట్టెక్కించలేదని ఈ చిత్ర ఫలితం మరోసారి స్పష్టం చేసింది.
