CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికి ప్రజాసేవకే అంకితమైన దళపతి విజయ్.. మరోసారి కెమెరా ముందుకు రానున్నారు. అయితే ఇది ఏ సినిమా కోసమో కాదు.. తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారం కోసం! ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రూపొందిస్తున్న ఓ భారీ యాడ్ ఫిలింలో సీఎం విజయ్ స్వయంగా నటించనున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బ్రాండ్ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రే స్వయంగా..
సాధారణంగా ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా చేరవేయడానికి సినీ స్టార్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవడం ఆనవాయితీ. అయితే, ప్రస్తుతం విజయ్ కంటే ఎక్కువ ఆకర్షణీయమైన ప్రజాకర్షణ తమిళనాడులో మరొకరికి లేదు. ఈ క్రమంలో బయటి నటీనటులపై ఆధారపడకుండా, ప్రజలకు స్వయంగా భరోసా ఇచ్చేలా ముఖ్యమంత్రే నేరుగా తెరపై కనిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్‌గా గౌతమ్ మీనన్.. బిగ్ బడ్జెట్ యాడ్ ఫిల్మ్..
సాధారణ ప్రభుత్వ ప్రకటనల మాదిరిగా కాకుండా, ఈ యాడ్‌ను ఒక హై-ఎండ్ సినిమా సీన్ తరహాలో గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ యాడ్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రభుత్వ ప్రకటనల బడ్జెట్ చాలా పరిమితంగా ఉంటుంది. కానీ ఈ యాడ్‌ను భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు కలిగిన టెక్నికల్ టీమ్‌తో షూట్ చేయనున్నారు. ప్రజలను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేలా, ప్రభుత్వ పథకాల ఆశయాన్ని సూటిగా వివరించేలా దీని స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల కాల్షీట్స్.. ఉప ఎన్నికల తర్వాత షూటింగ్..
రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు, ఫైళ్ల క్లియరెన్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సీఎం విజయ్.. ఈ ప్రకటన చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా రెండు రోజుల సమయాన్ని కేటాయించినట్లు సమాచారం. తమిళనాడులో జరగనున్న 5 నియోజకవర్గాల అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ యాడ్ షూటింగ్ ప్రారంభం కానుంది.
కేవలం రెండు రోజుల్లోనే విజయ్ పై వచ్చే కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేయడానికి చిత్ర బృందం ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తోంది.సినిమాలకు గుడ్ బై చెప్పిన తమ అభిమాన హీరోను మరోసారి వెండితెరపై చూసే అవకాశం లేకపోయినా.. ముఖ్యమంత్రి హోదాలో గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ఓ అద్భుతమైన యాడ్ ఫిల్మ్ ద్వారా మళ్లీ కెమెరా ముందుకు వస్తుండటం దళపతి అభిమానులకు కొండంత సంతోషాన్ని కలిగిస్తోంది.
