Kaala Bhairava Engagement

Kaala Bhairava Engagement: కీరవాణి ఇంట మొదలైన పెళ్లి బాజాలు.. కాల భైరవ – కావ్య కల్యాణ్ రామ్ వివాహ పనులు షురూ..

Kaala Bhairava Engagement: టాలీవుడ్‌లో మరో అందమైన ప్రేమ జంట త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, యువ సంగీత దర్శకుడు కాల భైరవ.. ‘బలగం’ ఫేమ్ హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల (డిసెంబర్)లో ఈ జంట వివాహం ఘనంగా జరగనుండటంతో ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఇందులో భాగంగా కాబోయే పెళ్లికూతురు ఇంట్లో సంప్రదాయబద్ధంగా వివాహ పనులను ప్రారంభించారు.

రాజమౌళి, కీరవాణి కుటుంబాల సమక్షంలో వేడుక..

పెళ్లి పనుల ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించిన ఫోటోలను కావ్య తండ్రి కల్యాణ్ రామ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ వేడుకలో కాబోయే వరుడు కాల భైరవతో పాటు ఎం.ఎం. కీరవాణి దంపతులు పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకకి ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన సతీమణి రమ కూడా ఈ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నవ్వులు పూయిస్తూ సరదాగా సాగిన ఈ వేడుక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ప్రేమ నుంచి పెళ్లి పీటల దాకా..

బాలనటిగా ‘గంగోత్రి’, ‘ఠాగూర్’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన కావ్య కల్యాణ్ రామ్.. ‘మసూద’, ‘బలగం’ చిత్రాలతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కాల భైరవ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సినీ వర్గాల్లో వార్తలు రాగా.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఆగస్టు 31న తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒకరిపై ఒకరు ఉన్న ప్రేమానురాగాలను వెల్లడిస్తూ నిశ్చితార్థాన్ని కూడా ముగించుకున్నారు.వచ్చే నెలలో ముహూర్తం ఖరారు కావడంతో ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్!

వచ్చే నెలలో టాలీవుడ్‌లో మరికొన్ని ప్రముఖ శుభకార్యాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడు, హీరో సాయి దుర్గా తేజ్ తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఇటీవల నిశ్చితార్థం చేసుకోగా..

యువ హీరో తేజ సజ్జా కూడా వచ్చే నెలలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీరవాణి ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న కావ్య కల్యాణ్ రామ్‌కు, కాల భైరవకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *