Donald Trump

Donald Trump: ట్రంప్‌కు తగిలిన ఇరాన్ సెగ.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఘోర పరాజయం..!

Donald Trump: అమెరికన్ సమాజపు జీవన విధానాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది ‘వినియోగతత్వం’ (Consumerism). సూపర్ మార్కెట్లలో కొండలా పేర్చిన షాపింగ్ కార్ట్‌లు, హైవేల వెంట భారీ బర్గర్లు, కార్ల ప్రయాణాలు ఆ దేశ సంస్కృతిలో భాగం. అమెరికా స్థూల ఆర్థిక కార్యకలాపాల్లో 70 శాతానికి పైగా వ్యక్తిగత వినియోగంపైనే ఆధారపడి ఉంటుంది.

అలాంటి జీవన ప్రమాణాలకు పెరిగిన జీవన వ్యయం (Cost of Living) గండికొడితే అమెరికన్లు అస్సలు సహించరు. సరిగ్గా ఇదే అంశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మధ్యంతర ఎన్నికల్లో నిలువునా ముంచేసింది. ఇరాన్‌తో మొదలుపెట్టిన యుద్ధం, దానివల్ల భగ్గుమన్న చమురు ధరలు.. ట్రంప్‌ పార్టీ అయిన రిపబ్లికన్లకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి.

ఇరాన్ యుద్ధం తెచ్చిన చమురు సంక్షోభం..

యుద్ధాల నుంచి అమెరికాను బయటకు తెస్తానని హామీ ఇచ్చి 2025 జనవరిలో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన ట్రంప్.. చివరకు ప్రపంచాన్ని భారీ యుద్ధంలోకి నెట్టారనే విమర్శలు మూటగట్టుకున్నారు.
  • యుద్ధం & హోర్ముజ్ సంక్షోభం: ఇరాన్‌పై దాడులు చేసి అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టిన తర్వాత, పశ్చిమాసియా రణరంగంగా మారింది. వ్యూహాత్మక ‘హోర్ముజ్ జలసంధి’ని ఇరాన్ స్తంభింపజేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అస్తవ్యస్తమైంది.
  • భగ్గుమన్న ధరలు: యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 70 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 105 డాలర్లకు ఎగబాకింది (ఏప్రిల్‌లో 125 డాలర్లను తాకింది).
  • అమెరికాలో ద్రవ్యోల్బణం: యూఎస్ గ్యాస్ స్టేషన్లలో పెట్రోల్ ధరలు 40 శాతం పెరగ్గా, డీజిల్ ధరలు 60-70 శాతం పెరిగాయి. 90 శాతం నిత్యావసర సరుకుల రవాణా డీజిల్ ట్రక్కులపైనే ఆధారపడే అమెరికాలో ద్రవ్యోల్బణం (CPI) 2.4 శాతం నుంచి 3.8 శాతానికి చేరి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టింది.

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల కోటలు బద్దలు..

పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్ భారాన్ని భరించలేక యూరప్ దేశాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపగా.. అమెరికన్లు మాత్రం బ్యాలెట్ బాక్సుల ద్వారా ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు.
  • కాంగ్రెస్ డెమొక్రాట్ల వశం: మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘనవిజయం సాధించి యుఎస్ కాంగ్రెస్‌పై పూర్తి నియంత్రణను సాధించారు.
  • టెక్సాస్‌లో చారిత్రక మార్పు: రిపబ్లికన్లకు కంచుకోటగా ఉన్న టెక్సాస్ రాష్ట్రంలో డెమొక్రాట్లు సెనేట్‌తో పాటు గవర్నర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. నెటిజన్లు అన్నట్లు.. ఇరాన్‌లో ప్రభుత్వం మారడం అటుంచితే, టెక్సాస్‌లో మాత్రం మార్పు వచ్చింది.
  • కాన్సాస్, ఒహియో, అయోవా: 1932 తర్వాత తొలిసారిగా కాన్సాస్‌లో డెమొక్రాట్ సెనేటర్ విజయం సాధించగా, 2024లో ట్రంప్ సునాయాసంగా గెలిచిన ఒహియో, అయోవా రాష్ట్రాలు సైతం డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపాయి.

ఇరాన్ యుద్ధమే మా కొంపముంచింది.. ట్రంప్ స్వయంగా అంగీకారం

రాయిటర్స్/ఇప్సోస్ సర్వే ప్రకారం 48 శాతం మంది అమెరికన్లు జీవన వ్యయాల పెరుగుదలనే తమ ప్రధాన ఎన్నికల అంశంగా పేర్కొన్నారు. 49 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితి ట్రంప్ హయాంలో దిగజారిందని అభిప్రాయపడ్డారు.
ఈ ఘోర పరాజయంపై స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’తో ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ.. రిపబ్లికన్ పార్టీ పరాజయానికి ఇరాన్ యుద్ధ ప్రభావం కూడా ఒక ప్రధాన కారణమని (“Iran was a piece of it”) అంగీకరించారు. “అమెరికా ఫస్ట్” సిద్ధాంతాన్ని పక్కనపెట్టి అమెరికాను అంతం లేని యుద్ధంలోకి లాగినందుకు ఓటర్లు ట్రంప్‌కు గట్టి బుద్ధి చెప్పారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *