Hyderabad 

Hyderabad: గ్రేటర్ పరిధిలో 7.60 లక్షల వీధి దీపాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్..

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన నగరాలు, శివారు ప్రాంతాల్లో రాత్రివేళల్లో చీకట్లను పారద్రోలి నిరంతర విద్యుత్ వెలుగులను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 7,60,591 ఎల్‌ఈడీ (LED) వీధి దీపాలు, వాటికి అనుసంధానమైన సీసీఎంఎస్ (CCMS) ప్యానళ్లు, ఇతర మౌలిక సదుపాయాల పదేళ్ల సమగ్ర నిర్వహణ కాంట్రాక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. గతంలో మంజూరు చేసిన రూ.1,341.60 కోట్ల వ్యయాన్ని సవరించి, తాజాగా మరో రూ.379.23 కోట్లు పెంచుతూ మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1,720.83 కోట్లుగా ఖరారు చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎల్‌-1గా బీఏసీ ఇన్‌ఫ్రాటెక్ – విన్సీ గ్లోబల్ జేవీ..

వీధి దీపాల నిర్వహణ కోసం నిర్వహించిన టెండర్లలో అత్యల్ప ధరను కోట్ చేసిన BAC Infratech Pvt Ltd – Vinci Global Pvt Ltd జాయింట్ వెంచర్ ఎల్‌-1గా ఎంపికైంది.. ఒక్కో వీధి దీపానికి నెలకు రూ.153.60 చొప్పున ఈ సంస్థ కోట్ చేసింది. ప్రభుత్వ అంతర్గత బెంచ్‌మార్క్ ధర (రూ.147) కంటే ఇది 4.49 శాతం అధికమైనప్పటికీ, పోటీదారులతో పోలిస్తే తక్కువగా ఉండటంతో టెండర్ల కమిషనరేట్ ఆమోదం తెలిపింది. ఈ జాయింట్ వెంచర్‌లో బీఏసీ ఇన్‌ఫ్రాటెక్ వాటా 74 శాతం కాగా, విన్సీ గ్లోబల్ వాటా 26 శాతంగా ఉంది.

ఎల్‌-2 సంస్థ: బజాజ్ ఎలక్ట్రికల్స్ – మ్యాట్రిక్స్ మీటర్స్ కన్సార్టియం ఒక్కో దీపానికి నెలకు రూ.153.90 కోట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఎల్‌-1 సంస్థకు లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ (LoA) జారీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ప్రాజెక్టు బడ్జెట్ విభజన (రూ.1,720.83 కోట్లు)..

పదేళ్ల కాలానికి ప్రాజెక్టు వ్యయ అంచనాలను ప్రభుత్వం సమగ్రంగా రూపొందించింది.

  • నిర్వహణ వ్యయం (Maintenance Cost): రూ. 1,401.93 కోట్లు

  • జీఎస్టీ (18% GST): రూ. 252.35 కోట్లు

  • థర్డ్ పార్టీ పర్యవేక్షణ ఏజెన్సీ (ఓయూ): రూ. 31.50 కోట్లు

  • ఇతర పన్నులు/అనుబంధ వ్యయాలు: రూ. 35.05 కోట్లు

  • మొత్తం మంజూరైన వ్యయం: రూ. 1,720.83 కోట్లు

మూడు కార్పొరేషన్ల వారీగా దీపాల సంఖ్య & ఆర్థిక భారం..

టెండర్ ప్రక్రియ మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించినప్పటికీ, ఆర్థిక భారాన్ని ఆయా కార్పొరేషన్లే స్వయంగా భరించాల్సి ఉంటుంది. నిర్వహణ సంస్థతో మూడు కార్పొరేషన్లు విడివిడిగానే ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.

కార్పొరేషన్ పేరు ఎల్‌ఈడీ వీధి దీపాల సంఖ్య కేటాయించిన నిర్వహణ వ్యయం
జీహెచ్‌ఎంసీ (GHMC) 3,30,487 దీపాలు రూ. 747.72 కోట్లు
సైబరాబాద్ కార్పొరేషన్ (CMC) 1,85,258 దీపాలు రూ. 419.16 కోట్లు
మల్కాజిగిరి కార్పొరేషన్ (MMC) 2,44,846 దీపాలు రూ. 553.95 కోట్లు
మొత్తం 7,60,591 దీపాలు రూ. 1,720.83 కోట్లు

కాంట్రాక్ట్ నిబంధనల్లోని క్లాజ్ 3.7.18 ప్రకారం స్వతంత్ర థర్డ్ పార్టీ పర్యవేక్షణ ఏజెన్సీగా ప్రముఖ విద్యాసంస్థ ఉస్మానియా యూనివర్సిటీ (OU) ఎంపికైంది.వీధి దీపాల పనితీరు, నిర్వహణ సేవల ప్రమాణాలు, సాంకేతిక స్పెసిఫికేషన్లు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా అనే అంశాన్ని ఓయూ సాంకేతిక బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది.

కాంట్రాక్టర్ సమర్పించే బిల్లుల ధ్రువీకరణ, నిర్వహణ లోపాలు లేదా లైట్లు వెలగని సందర్భాల్లో జరిమానాల (Penalties) విధింపును ఓయూ నిర్ధారిస్తుంది.ఈ స్వతంత్ర ఆడిట్, సాంకేతిక సహకారం కోసం ఉస్మానియా వర్సిటీకి రూ.31.50 కోట్లను కేటాయించారు.

ప్రధాన లక్ష్యాలు & అమలు గడువు..

వీధి దీపాలు వెలగకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొనే భద్రతా సమస్యలను నివారించడం, ఫిర్యాదు అందిన వెంటనే సాంకేతిక లోపాలు సరిదిద్దడం, ఆటోమేటిక్ సీసీఎంఎస్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఆదా చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. టెండర్ బిడ్ల చెల్లుబాటు గడువు 2027 ఫిబ్రవరి 3 వరకు ఉండటంతో, ఆలోపే అన్ని అధికారిక అనుమతులు పూర్తి చేసుకుని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మూడు కార్పొరేషన్ల కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *