Raptadu Incident

Raptadu Incident: రాప్తాడు బాధిత బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేష్ ట్వీట్..!

Raptadu Incident: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్మాది చేతిలో ఎలక్ట్రిక్ రంపం దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతోంది. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వరుస హెల్త్ అప్‌డేట్స్ పంచుకున్నారు. బాలిక స్పృహలోకి వచ్చిందని, వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారని (Extubated) ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి నారా లోకేష్ ట్వీట్ వివరాలు..

మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం విడుదల చేసిన తాజా హెల్త్ అప్‌డేట్స్ ప్రకారం.. బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ఆమె కళ్లు తెరిచి చూస్తోందని, బీపీ, పల్స్ వంటి అన్ని కీలక పారామీటర్లు నిలకడగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడం సాధారణ స్థితికి చేరుకోవడంతో వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారు. స్పృహలోకి వచ్చిన బాలిక వైద్యులతో మాట్లాడుతోందని, తన స్కూల్ టీచర్ ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా ఆరా తీసిందని లోకేష్ పేర్కొన్నారు. ఈ పరిణామం ఆ చిన్నారి మనోధైర్యానికి, వైద్యుల అంకితభావానికి నిదర్శనమని అన్నారు.

 

ప్రాథమిక ఆప్తాల్మాలజీ (కంటి పరీక్షలు), న్యూరో సర్జరీ రివ్యూలలో ఎలాంటి తీవ్రమైన సమస్యలు కనిపించలేదని వైద్యులు ధ్రువీకరించారు. ఈ వారం చివర్లో కంటికి సంబంధించిన సమగ్ర పరీక్షలతో పాటు ఆర్థోపెడిక్ సర్జరీ చేయనున్నారు. బాలిక సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

వైద్యులతో మాట్లాడిన మంత్రి సత్యకుమార్

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్వయంగా మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి గోపిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ పరంగా అయ్యే పూర్తి వైద్య ఖర్చులను భరిస్తామని, చిన్నారికి అత్యాధునిక చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. నిపుణులైన వైద్య బృందం నిరంతరం బాలికను పర్యవేక్షిస్తోందని, ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
నిందితుడు హేమంత్‌కు ఆపరేషన్.. బుల్లెట్లు తొలగింపు
మరోవైపు ఆత్మకూరు అడవుల్లో పోలీసులపై దాడికి యత్నించి, పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడిన నిందితుడు హేమంత్ (21) ఆరోగ్యంపై అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) వైద్యులు వివరాలు వెల్లడించారు.
కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి బుల్లెట్లను తొలగించారు. కుడి కాలికి రక్తప్రసరణ ఆగిపోవడంతో మోకాలి పైవరకు తొలగించాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆసుపత్రిలోని ఏఎంసీ వార్డులో పోలీసుల గట్టి బందోబస్తు నడుమ చికిత్స కొనసాగుతోందని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన
తరగతి గదిలో తోటి విద్యార్థులు, టీచర్ చూస్తుండగానే మొద్దులు కోసే ఎలక్ట్రిక్ రంపంతో హేమంత్ విచక్షణారహితంగా దాడికి పాల్పడటం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దాడిలో గోపిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు కాగా, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితురాలు లక్ష్మి కూడా గాయపడింది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినుల వైద్యానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *