SEC Anil Chandra Punetha: ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ప్రధాన నగరాల్లోని ఓటర్లు పోలింగ్‌పై కొంత నీరసం ప్రదర్శించినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 48.03 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల సరళి, నమోదైన ఫిర్యాదులపై పూర్తి వివరాలను వెల్లడించారు.
ఎన్నికల సంఘం అత్యంత నిష్పాక్షికంగా విధులు నిర్వహించిందని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పరిశీలించామని, జిల్లా పరిశీలకులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురైన విజయవాడ 55వ డివిజన్‌లో ఓటర్లకు అదనంగా రెండున్నర గంటల సమయం కేటాయించినట్లు వెల్లడించారు.
కడప జిల్లా పులివెందులలో జరిగిన ఘర్షణలు, దాడులపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. దీనిపై ఇప్పటికే కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు ఎస్‌ఈసీ తెలిపారు. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారుల అధికారిక నివేదికలు పరిశీలించిన తర్వాతే నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని, సరైన ఆధారాలు లేకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చిచెప్పారు. పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
