AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల మహా సమరం ముగిసింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలతో పూర్తయింది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మధ్యాహ్నం వేళల్లో కాస్త నెమ్మదించిన సరళి.. సాయంత్రానికి మళ్లీ పుంజుకుంది. సాయంత్రం 5 గంటల నాటికి కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే వెసులుబాటు కల్పించడంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
పోలింగ్ సరళి.. చిన్న పట్టణాల్లో జోరు.. నగరాల్లో నత్తనడక!
ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం పట్టణాలు, నగరాల మధ్య ఓటింగ్ శాతంలో భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.మధ్యాహ్నం 3 గంటల గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 48.03 శాతం పోలింగ్ నమోదు కాగా, కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఏకంగా 73.96 శాతంతో రికార్డు సృష్టించింది.
ప్రకాశం జిల్లా చీమకుర్తి (73.64%), మార్కాపురం పరిధిలోని కనిగిరి (73.20%), చిత్తూరు జిల్లా నగరి (71.78%), కడప జిల్లా బద్వేలు (71.52%) మున్సిపాలిటీల్లో ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి తీర్పునిచ్చారు. ప్రధాన నగరాల్లో ఓటింగ్ అనుకున్నంత స్థాయిలో నమోదు కాలేదు. ముఖ్యంగా విశాఖపట్నం జీవీఎంసీ (GVMC) పరిధిలో మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం 39.72 శాతం మాత్రమే ఓట్లు పోలై రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ నమోదైన ప్రాంతంగా నిలిచింది.
అక్కడక్కడా వివాదాలు.. మిగతా ప్రాంతాల్లో ప్రశాంతం
పులివెందుల వంటి కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాగింది. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
స్ట్రాంగ్‌రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులు.. నవంబర్ 3న కౌంటింగ్!
పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అధికారులు బ్యాలెట్ పెట్టెలకు సీల్ వేసి, సాయుధ బలగాల పహారా నడుమ నిర్ణీత స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రీపోలింగ్ అవసరమని భావించిన కేంద్రాల్లో సోమవారం (నవంబర్ 2న) రీపోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం మంగళవారం (నవంబర్ 3న) ఉదయం 8:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి వార్డులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలుపోటములపై పూర్తి స్పష్టత రానుంది.
