Revanth Reddy

Revanth Reddy: మోదీని ఓడించేందుకు వానర సైన్యం కదిలింది.. ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Revanth Reddy: దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ‘ఇండియా’ కూటమి తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ మహా ర్యాలీ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని రావణాసురుడితో, కాంగ్రెస్ కార్యకర్తలను ‘వానర సైన్యం’తో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, రాంలీలా మైదానం వేదికగా సాగే ఈ పోరాటం దేశంలో జరుగుతున్న ఓట్ల చౌర్యానికి, రాజ్యాంగ ధ్వంసానికి వ్యతిరేకంగా సాగే ప్రజా సమరమని స్పష్టం చేశారు.

రావణాసురుడి లాంటి మోదీని ఓడించేందుకు మా వానర సైన్యం సిద్ధం

తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు. రావణాసురుడి లాంటి మోదీని గద్దె దించేందుకు మా కాంగ్రెస్ వానర సైన్యం ఢిల్లీకి తరలివచ్చింది. ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా రాంలీలా మైదానం వేదికగా అసలైన పోరాటం మొదలవుతోంది” అని ప్రకటించారు. సమాజంలో కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట విభజించు పాలించు విధానాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దళితులు, గిరిజనులు, మహిళలు, యువతకు సమాన ఓటు హక్కు కల్పించారని, అలాంటి రాజ్యాంగ హక్కులను లాక్కోవాలని చూస్తున్న వారికి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.
ఓట్ల తొలగింపుపై పెను దుమారం: 13.5 కోట్లు గల్లంతు.. మరో 20 కోట్లకు కుట్ర?
ఎన్నికల సంఘం తీరుపై, బీజేపీ ఎత్తుగడలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
పథకం ప్రకారం ఓట్ల గల్లంతు: దేశంలో ఇప్పటివరకు ఏకంగా 13.5 కోట్ల మంది ఓట్లను చట్టవిరుద్ధంగా తొలగించారని, రాబోయే రోజుల్లో మరో 20 కోట్ల వరకు ఓట్లు తొలగించేందుకు పక్కా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
బీజేపీ ప్రయోగాలు: దేశవ్యాప్తంగా 15 నుంచి 20 శాతం ఓట్లను గల్లంతు చేసి అడ్డదారిలో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్‌లలో ప్రయోగాత్మకంగా ఓట్లను తొలగించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు.

 

సీఈసీపై విమర్శలు: మోదీ కుర్చీని కాపాడేందుకు, జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పెట్టి రాజ్యాంగానికి పునాది లాంటి ఓటు హక్కును దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.

రైళ్లను ఆపినా.. తెలంగాణ గళం ఆగలేదు..

ఈ మహా ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ఢిల్లీకి తరలిరాకుండా కేంద్ర ప్రభుత్వం రైళ్లను సైతం నిలిపివేసి అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు.
రైళ్లను ఆపినా మా పోరాట పటిమను ఆపలేకపోయారు. తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన జనసందోహం ముందు మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ తలవంచక తప్పలేదు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సాగిస్తున్న ఈ పోరాటం అంతిమంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *