dna

Bio-Synergy: మన శరీరానికి ఏం కావాలో మన డీఎన్‌ఏనే చెబుతుంది..

Bio-Synergy: మనం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి, ఎక్సర్‌సైజ్ చేయాలి అని అందరూ చెబుతుంటారు. కానీ, ఒకరికి సెట్ అయిన డైట్ లేదా ఫుడ్ ఇంకొకరికి సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం వేరు, వారి డీఎన్‌ఏ (DNA) వేరు.

ఈ విషయాన్నే ఆధారంగా చేసుకుని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ హెల్త్ కంపెనీ ‘బయో-సినర్జీ’ (Bio-Synergy) ఇండియాలోకి అడుగుపెడుతోంది. మన శరీర జన్యువులను (DNA & Epigenetics) టెస్ట్ చేసి, మన శరీరానికి సరిగ్గా ఎలాంటి తిండి, విటమిన్లు కావాలో చెప్పే సరికొత్త పద్ధతిని వీరు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ డేనియల్ హెర్మన్, చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ క్యాథరిన్ రాహిల్ చెప్పిన ఆసక్తికర విషయాలు  ఇపుడు తెలుసుకుందాం.

డీఎన్‌ఏ ఆధారంగా ఆరోగ్యం అంటే ఏంటి?

మనం పుట్టినప్పటి నుంచి మన శరీరంలో డీఎన్‌ఏ ఉంటుంది. ఇది మన శరీరానికి సంబంధించిన ఒక ‘బ్లూప్రింట్’ లేదా ‘కోడింగ్’ లాంటిది.

  • ఎపిజెనెటిక్స్ (Epigenetics): మన అలవాట్లు, మనం తినే తిండి, మనం ఉండే వాతావరణం మన జీన్స్ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చెప్పే శాస్త్రం ఇది.

  • పదేళ్ల క్రితం వరకు ఇలాంటి టెస్టులు చేయించుకోవాలంటే విపరీతమైన ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి టెస్టుల ధరలు తగ్గాయి.

  • లాభం ఏంటి?: ఉదాహరణకు, మీ శరీరంలో విటమిన్-డి లోపం ఉందని టెస్టులో తేలితే, కేవలం దానికి సంబంధించిన ఫుడ్ లేదా సప్లిమెంట్లు తీసుకుంటే సరిపోతుంది. అవసరం లేని మందులు, ప్రోటీన్ పౌడర్లు కొని డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు.

ఇండియాలో దీన్ని ఎలా ఉపయోగించబోతున్నారు?

ఇండియా అంటే చాలా పెద్ద దేశం. ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఉంటాయి.

  • బ్రిటన్ లాంటి దేశాల్లో వాడే రూల్స్, పద్ధతులను ఉన్నవి ఉన్నట్లుగా ఇండియాపై రుద్దలేమని కంపెనీ సైంటిస్ట్ డాక్టర్ క్యాథరిన్ స్పష్టం చేశారు.

  • ఇండియాలోని వివిధ ప్రాంతాల ప్రజల జీవనశైలి, డేటాను పరిశీలించి, ఇక్కడి వైద్య నిపుణులు, స్థానిక డాక్టర్ల సాయంతోనే ఈ పద్ధతిని డెవలప్ చేస్తారు.

  • డేటాను విశ్లేషించడానికి ఏఐ (AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని వాడినప్పటికీ, చివరకు డాక్టర్లు, నిపుణుల సలహాలతోనే సరైన డైట్ లేదా ప్లాన్ సూచిస్తారు.

ఇండియాలో ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏంటి?

  1. అవగాహన లేకపోవడం: డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా మన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని మార్చుకోవచ్చనే విషయం చాలామందికి ఇంకా తెలియదు. ప్రజలకు, డాక్టర్లకు దీనిపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం.

  2. అందరికీ అందుబాటులోకి తేవడం: టెస్టులు, ప్రొడక్ట్స్ ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా చేయడం కీలకం.

ఒక టెస్ట్ రిపోర్టే శాశ్వతం కాదు!

ఈ టెస్టులు ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై డాక్టర్ క్యాథరిన్ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. బ్లడ్ టెస్ట్ అయినా, డీఎన్‌ఏ టెస్ట్ అయినా అది ఆ సమయానికి మీ శరీరం ఎలా ఉందో మాత్రమే చెబుతుంది.కాబట్టి టెస్ట్ రిపోర్ట్ చూడగానే భయపడటం గానీ, అదే శాశ్వతం అనుకోవడం గానీ చేయకూడదు. మన నిత్యజీవితంలో ఆహారం మార్చుకున్నప్పుడు శరీరంలో మార్పులు వస్తాయి. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే రిపోర్టులను అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించాలి.

నాసా (NASA) స్పేస్ అనుభవాల నుంచి పాఠాలు..

డాక్టర్ క్యాథరిన్ గతంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA)లో వ్యోమగాముల (Astronauts) ఆరోగ్యంపై పరిశోధనలు చేశారు. ఆ అనుభవంతో ఆమె కొన్ని సూచనలు చేశారు.

వ్యోమగాములు భూమిపై ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉంటారు. కానీ స్పేస్‌లోకి వెళ్లాక భూమ్యాకర్షణ శక్తి (Gravity) ఉండదు కాబట్టి వారి ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. అంతరిక్షంలో ఉండే రేడియేషన్ వారి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాటిని తట్టుకోవడానికి వారు రోజూ రెండు గంటలు కచ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

మనం నేర్చుకోవాల్సింది: ప్రతి మనిషి శరీరం ఒకేలా ఉండదు. ‘అందరికీ ఒకటే డైట్.. అందరికీ ఒకటే వర్కవుట్’ అనే పద్ధతి పనికిరాదు. మన శరీర తత్వానికి, మన చుట్టూ ఉన్న వాతావరణానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలి.

మన చేతుల్లో ఉన్న మంచి ఆహారం, సరైన వ్యాయామం, తగినంత నిద్ర వంటి అలవాట్లను మన శరీర డీఎన్‌ఏ తీరుకు అనుగుణంగా మార్చుకుంటే, భవిష్యత్తులో రోగాలు రాకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించవచ్చని బయో-సినర్జీ ప్రతినిధులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *