తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని సుప్రీ ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్ కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అని సుప్రీం ప్రశ్నించింది. అలా వినియోగించినట్లు ఆధారాలు లేవన్న అత్యున్నత న్యాయస్థానం.. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ఎలా ప్రకటన చేస్తారని సుప్రీం ప్రశ్నించింది. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, టీటీడీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూర్ లేదా ఘజియాబాద్ ల్యాబ్ నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదని అడిగింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు సేకరించలేదని నిలదీసింది. ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు? కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపాలని వ్యాఖ్యానించింది. దేవుడినైనా రాజకీయాలను దూరంగా పెట్టండంటూ వ్యాఖ్యనించింది.
తిరుమల లడ్డూ వివాదంపై ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా..? లేదా స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగింది సుప్రీంకోర్టు. అనంతరం తిరుమల లడ్డూ వివాదంపై విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
