CI Nagaraju: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సాయికృష్ణది ముమ్మాటికీ ‘లాకప్ డెత్’ అని నిర్ధారించింది. సాయికృష్ణ మరణం చుట్టూ అల్లిన మిస్సింగ్ డ్రామా వెనుక ఉన్న భయంకరమైన కుట్రను, ఆధారాల లెక్కింపును సిట్ అధికారులు బద్దలు కొట్టారు. కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పొందుపరిచిన షాకింగ్ వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు, సాయికృష్ణను విజయవాడకు తీసుకొచ్చిన ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా సుదీర్ఘంగా విచారించారు. ఈ ఉమ్మడి విచారణలో పోలీసుల కస్టడీలోనే సాయికృష్ణ మరణించినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. అంతేకాకుండా, ఈ ఘోరానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా శవాన్ని మాయం చేయడంలోనూ, లీగల్ రికార్డులను తారుమారు చేయడంలోనూ కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు గుర్తించారు.
ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు ఏంటంటే, కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే సాయికృష్ణ మృతదేహాన్ని తాను స్వయంగా చూశానని సదరు స్టేషన్ ఎస్సై (SI) సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. సీఐ నాగరాజు నేతృత్వంలోనే సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేయడానికి, శవాన్ని అక్రమంగా దహనం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయని ఎస్సై ఇచ్చిన సాక్ష్యం ద్వారా స్పష్టమైంది. ఈ బలమైన ఆధారాలన్నింటినీ రిమాండ్ రిపోర్టులో చేర్చిన సిట్ అధికారులు.. తాజాగా సీఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించింది దింతో నెల్లూరు జైలుకి పోలీసులు తరలించారు.
