Amit Shah

Amit Shah: తెలంగాణకు అమిత్ షా.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ పాదయాత్ర..!

Amit Shah: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సిద్ధమైంది. ఇందులో భాగంగా నవంబర్ 2వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ చేపట్టనున్న మహా పాదయాత్రలో అమిత్ షా ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి రాకతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబాన్ని ఉద్దేశించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ నేతల తీరుకు నిరసనగా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత ఎన్. రాంచందర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరైన కొండారెడ్డిపల్లికి స్వయంగా తానే వస్తానని, అక్కడ ఎన్ని ఓట్లు తొలగించారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రాష్ట్రంలో 300కు పైగా మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రాజధాని హైదరాబాద్‌లో నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి సమస్యలను గాలికొదిలేసి ఢిల్లీ పర్యటనలకు ప్రాధాన్యమిస్తున్నారని రాంచందర్‌రావు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *