AP News

AP News: రాయచోటిలో తుపాకులు, బుల్లెట్లతో 10 మంది అరెస్ట్..!

AP News: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంతర్రాష్ట్ర నేర ముఠా కదలికలు తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. పంజాబ్ నుంచి మారణాయుధాలతో రాయచోటికి చేరుకున్న ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించి కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక రివాల్వర్, పిస్టల్, సుమారు 30కి పైగా లైవ్ రౌండ్ల బుల్లెట్లతో పాటు ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో తాము రాయచోటి వైసీపీ చైర్మన్ అభ్యర్థికి సెక్యూరిటీగా వచ్చామని పట్టుబడిన వ్యక్తులు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ ముఠాకు చెందిన వారు ఇంకా ఎంతమంది పట్టణంలో లేదా జిల్లా పరిసరాల్లో దాగి ఉన్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తూ విచారణ ముమ్మరం చేశారు.

ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రక్తపాతం సృష్టించి ప్రజలను, ఓటర్లను తుపాకులతో భయభ్రాంతులకు గురిచేసేందుకే వైసీపీ నాయకత్వం పంజాబ్ నుంచి కిరాయి రౌడీ మూకలను దిగుమతి చేసుకుందని టీడీపీ నేతలు ఆరోపించారు.

నిన్నటి ఘర్షణల వెనుక కూడా ఈ అంతర్రాష్ట్ర నేరగాళ్ల హస్తం ఉందని, వీరి ద్వారా పట్టణంలో అలజడి సృష్టించేందుకు పథకం రచించారని మండిపడ్డారు. పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీసు తనిఖీలు చేపట్టాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అదనపు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *