Spam Calls: స్పామ్ కాల్స్, సైబర్ మోసాలు, గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే విసుగు పుట్టించే ఫోన్ కాల్స్‌తో విసిగిపోయిన భారతీయ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దేశంలో సరికొత్త అధికారిక వెరిఫైడ్ కాలర్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్’ (Calling Name Presentation – CNAP) ను అమల్లోకి తీసుకువస్తున్నట్లు టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
నవంబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని టెలికాం ఆపరేటర్లు (రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులందరికీ ఈ సేవను డిఫాల్ట్‌గా ఉచితంగా అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే, ఆధార్ లింక్డ్ కేవైసీ (KYC) ఆధారంగా నమోదైన ఒరిజినల్ పేరు మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఎలా పనిచేస్తుంది ఈ CNAP కాలర్ ఐడీ?..
టెలికాం విభాగం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కాలర్ ఐడీ స్క్రీన్‌పై ఇలా డిస్ప్లే అవుతుంది..
-
మొదటి వరుసలో నంబర్: ఇన్కమింగ్ కాల్ రాగానే స్క్రీన్‌పై మొదటి ఫీల్డ్‌లో ఫోన్ చేస్తున్న వ్యక్తి నంబర్ కనిపిస్తుంది.
-
రెండో వరుసలో పేరు: ఒకవేళ ఆ నంబర్ మీ కాంటాక్ట్స్‌లో సేవ్ అయి ఉంటే, మీరు పెట్టుకున్న పేరే కనిపిస్తుంది. ఒకవేళ ఆ నంబర్ మీ ఫోన్లో సేవ్ లేకపోతే.. కాల్ చేస్తున్న వ్యక్తి ఏ టెలికాం సంస్థ సిమ్ వాడుతున్నారో, ఆ కంపెనీ కేవైసీ (KYC) డేటాబేస్‌లో నమోదైన అధికారిక ఒరిజినల్ పేరు ఆటోమేటిక్‌గా ప్రత్యక్షమవుతుంది.
-
ఇంటర్నేషనల్ కాల్స్: విదేశాల నుంచి వచ్చే కాల్స్ విషయంలో మోసాలను అరికట్టేందుకు స్క్రీన్‌పై స్పష్టంగా “International Call” అనే ట్యాగ్ కనిపిస్తుంది.
-
4G, 5G నెట్‌వర్క్‌లలో బై డిఫాల్ట్: ప్రస్తుతం 4G, 5G నెట్‌వర్క్‌లలో ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. పాత 2G, 3G నెట్‌వర్క్‌లు, ల్యాండ్‌లైన్ సర్వీసులపై రోల్అవుట్ను తర్వాత దశలో పరిశీలించనున్నారు.
ప్రైవేట్ యాప్‌లకు.. ప్రభుత్వ CNAPకి తేడా ఏంటి?..
ప్రస్తుతం చాలామంది వాడుతున్న ‘ట్రూకాలర్’ (Truecaller) వంటి థర్డ్ పార్టీ యాప్‌లు క్రౌడ్ సోర్సింగ్ (ఇతరులు సేవ్ చేసుకున్న పేర్లు) ద్వారా పేర్లను చూపిస్తాయి. దీనివల్ల చాలాసార్లు తప్పుడు పేర్లు, ఫన్నీ పేర్లు కనిపిస్తాయి. పైగా పూర్తి ఫీచర్ల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ అడుగుతాయి.
కానీ కేంద్రం తెచ్చిన CNAP అలా కాదు.
-
100% నమ్మకమైన డేటా: సిమ్ కార్డు తీసుకునే సమయంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులతో వెరిఫై చేసిన అధికారిక కేవైసీ పేరే ఇందులో కనిపిస్తుంది.
-
పూర్తిగా ఉచితం: వినియోగదారులు ఎలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోనవసరం లేదు, ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు.
డేటా సెక్యూరిటీ & టెలిమార్కెటింగ్ కంపెనీల రూల్స్..
యూజర్ల వ్యక్తిగత భద్రత, ప్రైవసీని కాపాడేందుకు ప్రభుత్వం పకడ్బందీ నిబంధనలు పెట్టింది. ‘సెక్యూరిటీ బై డిజైన్’ (Security-by-design) విధానం ప్రకారం.. ఇన్కమింగ్ కాల్ ముగిసిన వెంటనే కాలర్ పేరు తాలూకు సమాచారం తాత్కాలిక నెట్వర్క్ మెకానిజం నుంచి తొలగిపోతుంది. డేటాను నిల్వ ఉంచే వీలుండదు.
రహస్య నంబర్ల మినహాయింపు..
కాలర్ ఐడీని దాచుకునే అధికారిక సౌకర్యం (CLIR – Calling Line Identification Restriction) తీసుకున్న ప్రత్యేక కేటగిరీ యూజర్ల పేర్లు స్క్రీన్‌పై కనిపించవు.
వ్యాపారాలు, బల్క్ కనెక్షన్లకు ప్రత్యేక రూల్..
బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలిమార్కెటింగ్ కంపెనీల వంటి వ్యాపార సంస్థలు తమ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ పేరును లేదా జీఎస్టీ (GST) పోర్టల్‌లో నమోదైన సంస్థ పేరును మాత్రమే కాలర్ ఐడీగా పెట్టుకోవాలి. సదరు పత్రాలను టెలికాం ఆపరేటర్లు వెరిఫై చేసిన తర్వాతే ఆ పేరు డిస్ప్లే అవుతుంది. దీనివల్ల ఫేక్ లోన్ ఆఫర్లు, ఫ్రాడ్ కాల్స్‌ను ప్రజలు ఇట్టే గుర్తుపట్టి రిజెక్ట్ చేయవచ్చు. ట్రాయ్ (TRAI) చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధన డిజిటల్ భారత్‌లో సైబర్ క్రైమ్‌లకు, ఫేక్ కాల్స్ బెడదకు పెద్ద బ్రేక్ వేయనుంది.
