Imran Khan: బాలీవుడ్ ప్రముఖ నటుడు, అగ్ర హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు (43) భారత ఇమ్మిగ్రేషన్ విభాగం షాక్ ఇచ్చింది. విదేశీ పౌరుడై ఉండి దేశంలో రాజకీయ నిరసనల్లో పాల్గొన్నారన్న ఆరోపణలపై ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని (Leave India Notice) ముంబైలోని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఆదేశించింది.
ఈ నోటీసును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ లీగల్ టీమ్ శుక్రవారం లేదా సోమవారం నాటికి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. చీఫ్ జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేత్నాలతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట అత్యవసర విచారణ కోరనున్నట్లు సమాచారం. ప్రముఖ న్యాయ సేవా సంస్థ ‘ఎంజెడ్ఎం లీగల్ ఎల్ఎల్పీ’ (MZM Legal LLP) తరఫున సీనియర్ న్యాయవాదులు జుల్ఫికర్ మేమన్, పర్వేజ్ మేమన్, చిరాగ్ నాయక్‌లు నటుడి తరఫున కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
వివాదం నేపథ్యం: ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో నిరసన
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చింది. ఈ నిరసనకు సంఘీభావంగా అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో జరిగిన ఆందోళనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.
ఆ సమయంలో ముంబై పోలీసులు ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వ్యాన్ లోపల నుంచి సెల్ఫీ దిగి, “apparently, I’m going for a drive” అంటూ ఇమ్రాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ సంస్థకు ప్రతినిధిగా రాలేదని, ఈ నగరంలో నివసిస్తున్న వ్యక్తిగా గొంతు నొక్కేయడాన్ని చూసేందుకే వచ్చానని వ్యాఖ్యానించారు.
బీజేపీ నేత ఫిర్యాదు – ఎఫ్ఆర్ఆర్ఓ చర్యలు..
ఈ ఘటన తర్వాత బీజేపీ సీనియర్ నేత కిరీట్ సోమయ్య ముంబై పోలీస్ కమిషనర్‌తో పాటు కేంద్ర హోంశాఖకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరసత్వం (US Citizen) కలిగి ఉన్నారని, ఆయన కేవలం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డుదారుడు మాత్రమేనని స్పష్టం చేశారు.
విదేశీయులకు నిరసన హక్కు లేదు..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించే వాక్ స్వాతంత్ర్యం, శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రాథమిక హక్కులు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఫారెనర్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం విదేశీ పౌరులు ఎలాంటి రాజకీయ ఆందోళనల్లో పాల్గొనడానికి వీల్లేదు.
సెక్షన్ 7 కింద ఆదేశాలు..
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్, 2025 లోని సెక్షన్ 7 కింద కేంద్ర ప్రభుత్వానికి విదేశీయుల రాకపోకలు, బసపై సంపూర్ణ నియంత్రణ అధికారం ఉంటుంది. వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అక్టోబర్ 28లోపు భారత్ వదిలి వెళ్లాలంటూ ఎఫ్ఆర్ఆర్ఓ నోటీసు జారీ చేసింది.
బాంబే హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ వాదనలు ఎలా ఉండబోతున్నాయి?
ఇమ్రాన్ ఖాన్ లీగల్ టీమ్ ఈ నోటీసు చట్టబద్ధతను బాంబే హైకోర్టులో తీవ్రంగా ప్రశ్నించే అవకాశం ఉంది.
ఓసీఐ (OCI) కార్డుదారులను ఏకపక్షంగా ఇలా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం అత్యంత తీవ్రమైన చర్య (Drastic measure).
భారతీయ సంతతికి చెందిన ఓసీఐ కార్డుదారులు శాంతియుత ప్రజాస్వామ్య నిరసనల్లో పాల్గొనడాన్ని చట్టంలో స్పష్టంగా ఎక్కడా పూర్తిగా నిషేధించలేదని లీగల్ టీమ్ వాదించనుంది.
స్పందించిన ప్రతిపక్షాలు..
ఈ పరిణామంపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. “మన దేశానికి చెందిన ఎంతోమంది విదేశాల్లో ఉంటున్నారు.. అక్కడి స్థానిక నిరసనల్లో పాల్గొంటున్నారు. వారిని ఎవరూ దేశం నుంచి గెంటేయడం లేదు కదా” అని కేంద్రం తీరును తప్పుబట్టారు. శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ.. .
దేశంలో యువతరం చేపట్టిన నిరసనలకు మద్దతు తెలిపినందుకే ప్రభుత్వం భయపడి ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. బాంబే హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్‌పై వెలువడే తీర్పు ఓసీఐ కార్డుదారుల హక్కులపై దేశవ్యాప్తంగా న్యాయపరమైన స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
