Supreme Court

Supreme Court: సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణలు చెప్పిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి

Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనల సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న కోర్టు ధిక్కార (Contempt) కేసులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అత్యున్నత న్యాయస్థానానికి బేషరతు క్షమాపణలు (Unconditional and unqualified apology) చెప్పారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని స్పష్టం చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న జరిగిన నిరసనల వేళ.. మెట్రో, రైలు రాకపోకలపై పూర్తిస్థాయి నిషేధం విధించరాదన్న కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పిటిషనర్లు ఆరోపించడంతో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీల ధర్మాసనం కేంద్ర హోంశాఖ కార్యదర్శి సహా ఢిల్లీ పోలీసు కమిషనర్, డీఎంఆర్‌సీ చైర్‌పర్సన్‌లకు నోటీసులు జారీ చేసింది.
క్షమాపణలు చెబుతూనే ఇంటర్నెట్ నిషేధంపై సమర్థన..
జంతర్ మంతర్ పరిసరాల్లో ఒక రోజు పాటు సెల్యులార్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని చట్టబద్ధంగా పరిశీలించి ఆమోదించినట్లు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నివారించడానికి ఆ పరిస్థితి తీవ్రతకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమేనని పేర్కొన్నారు.

 

4 కిలోమీటర్ల పరిధిలోనే ఆంక్షలు..
రాయ్‌సినా హిల్స్‌కు నాలుగు కిలోమీటర్ల పరిధిలో అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుంచి అక్టోబర్ 10 రాత్రి 10 గంటల వరకు మాత్రమే మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత పరిమితమైందని స్పష్టం చేశారు. బ్రాడ్‌బ్యాండ్, వై-ఫై లేదా ల్యాండ్‌లైన్ టెలికమ్యూనికేషన్ సేవలను ఎక్కడా నిలిపివేయలేదని వివరించారు.
ఉద్దేశపూర్వక ఉల్లంఘన కాదు..
కోర్టు మార్గదర్శకాలను కావాలని తాము ధిక్కరించలేదని, అత్యవసర పరిస్థితుల్లో చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసేలా అక్టోబర్ 11 నాటి కోర్టు ఉత్తర్వులను సవరించాలని కోరారు. అలాగే తనపై జారీ చేసిన కోర్టు ధిక్కార నోటీసును రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *