Stock Market: దేశంలో డిజిటల్ చెల్లింపులు చేసే చిరు వ్యాపారులు, వినియోగదారులకు పండుగ సీజన్లో ఊరటనిచ్చే వార్త. యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేయాలన్న ప్రతిపాదనను దీపావళి 2026 వరకు వాయిదా వేస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది.
వాస్తవానికి ఈ కొత్త ఛార్జీల నిబంధన అక్టోబర్ 15 నుంచే అమల్లోకి రావాల్సి ఉండగా, దసరా, దీపావళి షాపింగ్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎన్పీసీఐ స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి ముగిసిన వెంటనే ఎంపిక చేసిన కేటగిరీల వ్యాపార లావాదేవీలపై ఈ నిబంధనను ఎప్పటి నుంచి అమలు చేస్తారో ప్రత్యేకంగా కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
అసలు యూపీఐ ఎండీఆర్ (MDR) అంటే ఏమిటి? ఎవరిపై ప్రభావం?..
మర్చంట్ డిస్కౌంట్ రేట్ అనేది సాధారణంగా డిజిటల్ చెల్లింపులను స్వీకరించినందుకు వ్యాపారులు చెల్లించే రుసుము. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P – Person to Person) జరిగే లావాదేవీలు, అలాగే రూ. 2,000 లోపు ఉండే సాధారణ మర్చంట్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు అవి పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి.
రూ. 2,000 దాటితేనే ఛార్జీ..
రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ఎంపిక చేసిన మర్చంట్ పేమెంట్స్పై 0.40% ఎండీఆర్ రుసుము వర్తిస్తుంది. అయితే లావాదేవీ విలువ ఎంత పెద్దదైనా సరే గరిష్ఠంగా రూ. 300 ఛార్జీ మాత్రమే పరిమితి (Capping) ఉంటుంది. కొన్ని నిత్యావసర సేవలకు స్థిరంగా రూ. 5 ఫీజు, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై 0.02% (గరిష్ఠంగా రూ. 300) ఛార్జీ వసూలు చేసేలా ముసాయిదా నిబంధనలు ఉన్నాయి.
పండుగ వాయిదాతో ఫిన్టెక్ షేర్లలో మళ్లీ ర్యాలీ..
ఎండీఆర్ ఛార్జీల వాయిదా వార్తలతో డిజిటల్ పేమెంట్స్, ఫిన్టెక్ కంపెనీల షేర్లలో మంచి రికవరీ కనిపించింది..
-
పేటీఎం (One97 Communications): మంగళవారం ఒక్కసారిగా రూ. 1,571 నుంచి రూ. 1,675 స్థాయికి ఎగబాకిన పేటీఎం షేరు, బుధవారం కూడా లాభాలతో రూ. 1,724 వద్ద ట్రేడవుతోంది.
-
పైన్ ల్యాబ్స్ (Pine Labs): డే లో అయిన రూ. 154.42 నుంచి పుంజుకుని రూ. 165 స్థాయికి చేరింది.
-
జ్యాగిల్ ప్రీపెయిడ్ (Zaggle): రూ. 163.87 నుంచి ప్రారంభమై బుధవారం నాటికి రూ. 170 మార్కును తాకింది.
-
మనీవ్యూ & మోబిక్విక్: మనీవ్యూ షేరు రూ. 60.06 నుంచి రూ. 62.90కి, మోబిక్విక్ సిస్టమ్స్ రూ. 242 నుంచి రూ. 246 స్థాయికి లాభపడ్డాయి.
గతంలో షేర్లు పతనం కావడానికి కారణం ఏంటి?..
ఈ వాయిదా నిర్ణయానికి ముందు అక్టోబర్ 8న పేటీఎం షేరు ఏకంగా 10%, మోబిక్విక్ 7.88%, పైన్ ల్యాబ్స్ 4% పైగా నష్టపోయాయి. కారణం ఏమిటంటే.. రూ. 2,000 పైబడిన ట్రాన్సాక్షన్లపై 0.4% ఛార్జీలు విధిస్తే ఫిన్టెక్ కంపెనీలకు యూపీఐ ద్వారా భారీగా ఆదాయం (Revenue) సమకూరుతుందని మార్కెట్ అంచనా వేసింది.
అయితే పండుగల వేళ లావాదేవీల వాల్యూమ్ గరిష్ఠంగా ఉండే సమయంలో ఎండీఆర్ వాయిదా పడటంతో కంపెనీల ఆదాయ రాక మరికొంత కాలం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో మొదట అమ్మకాల ఒత్తిడి కనిపించినా.. పండుగల సీజన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ల బూస్ట్ ద్వారా లాభపడవచ్చనే ఆశాభావంతో షేర్లు మళ్లీ స్థిరపడ్డాయి. పండుగ సమరంలో ఎలాంటి అదనపు భారం లేకుండా డిజిటల్ వ్యాపారాలు కొనసాగేందుకు వ్యాపారులకు ఈ వాయిదా వెసులుబాటును కల్పించింది.
