Vivek Sagar

Vivek Sagar: ‘తులాభారం’ గ్లింప్స్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వివేక్ సాగర్.. బిగ్ హిట్ కొడతారా?

Vivek Sagar: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న సంగీత దర్శకుడు వివేక్ సాగర్. అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. ఇండస్ట్రీలో ఆయనకు రావాల్సినంత గుర్తింపు, ప్రశంసలు ఇంకా దక్కలేదనే అభిప్రాయం సినీ ప్రియుల్లో ఎప్పటి నుంచో ఉంది. అయితే తాజాగా మాస్ మహారాజ రవితేజ హీరోగా, దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న తాజా సినిమా  ‘తులాభారం’ నుండి వచ్చిన టైటిల్ డాక్యుమెంట్ గ్లింప్స్‌తో వివేక్ సాగర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ గ్లింప్స్‌లో ఆయన అందించిన నేపథ్య సంగీతంతో పాటు, టైటిల్ ట్రాక్ కోసం రీమిక్స్ చేసిన పాత పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

పబ్లిసిటీకి దూరంగా ఉండే అరుదైన ప్రతిభ..

తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’తోనే సరికొత్త సౌండింగ్‌ను పరిచయం చేసి ఒక్కసారిగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు ప్రాణం పోసే సంగీతం అందించినా.. బాక్సాఫీస్ ఫలితాలు లేదా ఇతర కారణాల వల్ల ఆయన పనితనం పూర్తిస్థాయిలో చర్చకు రాలేకపోయింది.
తన సంగీతంతో శ్రోతలను పిచ్చెక్కించడం, ఆ తర్వాత ఎలాంటి హంగులూ ఆర్భాటాలూ లేకుండా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటం వివేక్ సాగర్ ప్రత్యేకత. వ్యక్తిగత ప్రచారానికి ఆమడ దూరంలో ఉండే ఆయన.. తన పనితోనే మాట్లాడటానికి ఇష్టపడతారు.
భారీ సక్సెస్ కోసం ఎదురుచూపులు..
గత కొన్నేళ్లుగా వివేక్ సాగర్ మార్క్ సాలిడ్ మ్యూజికల్ హిట్‌పై నిరీక్షణ కొనసాగుతోంది.. ఇటీవల కాలంలో ‘35: చిన్న కథ కాదు’ సినిమాకి అందించిన పనితనానికి మంచి ప్రశంసలు దక్కినప్పటికీ.. ఒక పూర్తి స్థాయి చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది.
గత ఏడాది ‘శుభం’తో పాటు మరో సినిమాకి పనిచేశారు. అందులో ఒకదానికి కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే అందించారు. ఈ ఏడాది విడుదలైన రెండు పాటలు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.సరిగ్గా ఇలాంటి సమయంలో వచ్చిన ‘తులాభారం’ చిన్నపాటి గ్లింప్స్ ఒక్కసారిగా ఆయనపై భారీ అంచనాలను పెంచేసింది.
వివేక్ ఆత్రేయ – వివేక్ సాగర్: మ్యాజికల్ కాంబో రీ-యూనియన్
దర్శకుడు వివేక్ ఆత్రేయ, వివేక్ సాగర్‌ల కాంబినేషన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వివేక్ ఆత్రేయ తొలి చిత్రం ‘మెంటల్ మదిలో’ నుంచి వీరి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ!’ సినిమాకు వివేక్ సాగర్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్లాసిక్‌లుగా నిలిచాయి.
మధ్యలో నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించినప్పటికీ.. రవితేజ సినిమా ‘తులాభారం’ కోసం వివేక్ ఆత్రేయ తిరిగి తన ఆస్థాన సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌నే ఎంచుకున్నారు.
ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ కలవడంతో ప్రాజెక్ట్‌పై హైప్ రెట్టింపైంది. ప్రస్తుతం గ్లింప్స్‌కు వస్తున్న రెస్పాన్స్‌ను బట్టి చూస్తే.. ‘తులాభారం’ పూర్తి ఆల్బమ్‌తో వివేక్ సాగర్ గనక అంచనాలను అందుకుంటే, ఆయన కెరీర్‌లో ఇది మరో కీలక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *