CJI Surya Kant: ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం పోరాడుతున్న విపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి నేతలకు సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. తమను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోరిన ప్రతిపక్ష నేతల అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. ఈ భేటీని తాను ఎందుకు నిరాకరించాల్సి వచ్చిందో స్పష్టం చేస్తూ విపక్ష నేతలకు ఆదివారం రాత్రే లేఖ ద్వారా లిఖితపూర్వక సమాధానం పంపినట్లు సీజేఐ స్వయంగా వెల్లడించారు.
రాహుల్ గాంధీ, ఖార్గే లేఖ – సీజేఐ బదులు..
భేటీకి అభ్యర్థన..
“ఓటు చోరీ”ని అరికట్టాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, వివాదాస్పద ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను నిలిపివేసి తిరిగి పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే ప్రధాన న్యాయమూర్తి అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వార్తా సంస్థ ANIతో మాట్లాడిన సీజేఐ.. ఆదివారం తనకు ఆ లేఖ అందిందని, ఆ రాత్రే తాను బదులిచ్చానని తెలిపారు.
కారణాలు రాహుల్‌నే అడగండి..
భేటీని ఎందుకు నిరాకరించారన్న వివరాలను బహిర్గతం చేయడానికి సీజేఐ సున్నితంగా నిరాకరించారు. “వారిద్దరి నడుమ జరిగిన లేఖల వ్యవహారంలో నేను పూర్తి గోప్యతను పాటించాను. ఆ లేఖలోని అంశాలు, కారణాల గురించి మీరు రాహుల్ గాంధీనే అడగాలని కోరుతున్నాను” అని స్పష్టం చేశారు.
కోర్టులో కేసులు ఉండగా కలవడం సముచితం కాదు..
న్యాయవర్గాల సమాచారం ప్రకారం.. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టు న్యాయపరిశీలనలో ఉన్నాయి. ఇలాంటి సున్నితమైన అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్న సమయంలో రాజకీయ కూటమి నాయకులను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు స్వీకరించడం న్యాయపరంగా సముచితం కాదని భావించినందునే సీజేఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన ప్రతిపక్ష నేతలకు అక్కడ కూడా పెద్దగా సానుకూల స్పందన లభించకపోవడం, ఇప్పుడు సీజేఐ సైతం భేటీకి నిరాకరించడంతో ఇండియా కూటమి తదుపరి న్యాయ, ప్రజా పోరాట మార్గాలపై దృష్టి సారించింది.
సుప్రీంకోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి..
ప్రజాప్రతినిధులు, ఎంపీలు తమ సమస్యలను న్యాయస్థానం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్న ప్రశ్నకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటిగా సమాధానమిచ్చారు..
పిటిషన్ ద్వారానే రావాలి..
సుప్రీంకోర్టు తలుపులు ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఒక సాధారణ పౌరుడైనా లేదా ఎన్నికైన ప్రజాప్రతినిధి అయినా.. పిటిషన్ రూపంలో కోర్టును ఆశ్రయిస్తే వారి వాదనలను వింటాం, చట్టానికి లోబడి తగిన ఉత్తర్వులు ఇస్తాం” అని పేర్కొన్నారు.
ఢిల్లీ నిరసనలపై వ్యాఖ్యానించలేను..
ఢిల్లీలో జరుగుతున్న భారీ నిరసనలు, లాక్డౌన్ తరహా పరిస్థితులపై మాట్లాడటానికి ఆయన నిరాకరిస్తూ.. అది పూర్తిగా శాంతిభద్రతల పరిధిలోని అంశమని తెలిపారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ జేపీసీ టూర్ రద్దుపై క్లారిటీ..
జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావడంపై స్పందిస్తూ.. ఆ అంశంపై కోర్టులో పరస్పర ప్రయోజనాల ఘర్షణ (Conflict of Interest) ఏర్పడే అవకాశం ఉన్నందున, న్యాయమూర్తులంతా పరిపాలనా పరంగా చర్చించి ఆ పర్యటనను నివారించాలని సమిష్టి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
