Abhijeet Dipke

Abhijeet Dipke: ఈ వీడియో మీరు చూస్తుంటే నేను అరెస్ట్ అయినట్టే..!

Abhijeet Dipke: దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన నిరసన మహా ఉద్రిక్తతలకు దారితీస్తున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టవడానికి ముందే సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే రూపొందించిన ‘ప్రీ-రికార్డెడ్ వీడియో’ను శనివారం పార్టీ అధికారికంగా విడుదల చేసింది.

తనతోపాటు సౌరవ్‌, రంకాను అరెస్టు చేస్తారని..  అపుడే జంతర్ మంతర్ ఆందోళనకు పార్టీ ఇన్‌ఛార్జ్ అజింక్యా షిండే (Ajinkya Shinde) నాయకత్వం వహిస్తారని దీప్కే ఆ వీడియో సందేశంలో ప్రకటించారు.
ఈ వీడియో చూస్తున్నారంటే మేము అరెస్టయినట్లే..
ముందస్తుగా రికార్డ్ చేసిన వీడియో సందేశంలో అభిజీత్ దీప్కే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
మీరు ఈ వీడియో చూస్తున్నారంటే.. నేను, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని అర్థం. మేము నిర్బంధంలో ఉన్నా నిరసన ఆగకూడదు. మా తర్వాత ఈ ఉద్యమాన్ని అజింక్యా షిండే ముందుండి నడిపిస్తారు. కాబట్టి కార్యకర్తలు, మద్దతుదారులంతా అజింక్యా షిండే ఇచ్చే ఆదేశాలను పాటించాలి. కాక్రోచ్ జనతా పార్టీ పోరాట పంథాను ఆయనే ముందుకు తీసుకెళ్తారు” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
విమానంలోకి చొచ్చుకొచ్చిన పోలీసులు – దీప్కే తీవ్ర వాగ్వాదం..
ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న విమానం ల్యాండ్ కాగానే జరిగిన హైడ్రామాకు సంబంధించిన మరో వీడియోను కూడా సీజేపీ విడుదల చేసింది. అందులో విమానం లోపలికి ప్రవేశించిన ఢిల్లీ పోలీసులతో అభిజీత్ దీప్కే తీవ్ర వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కనిపించాయి.
పోలీసులు మమ్మల్ని విమానం నుంచి కిందకు దిగనివ్వడం లేదు. దీనివల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశం ఏ దిశగా వెళ్తుందో ప్రజలు చూడాలి. ఏకంగా ఫ్లైట్ లోపలికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి నిరంకుశ చర్యను ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ కూడా చేయలేదు అని మండిపడ్డారు.

 

క్రిమినల్స్ తరహాలో వ్యవహరిస్తున్నారు..
ఇది ముమ్మాటికీ నియంతృత్వమే. మేమేమీ పారిపోవడం లేదు.. అరెస్ట్ కావడానికే వచ్చాం, రండి అరెస్ట్ చేసుకోండి. క్రిమినల్స్‌ను చుట్టుముట్టినట్లు పోలీసులు మాపై దాడి చేస్తున్నారు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ముందస్తు ప్రణాళికతోనే అరెస్టులు – సీజేపీ ప్రకటన..
జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడానికి ఎలాంటి పోలీసు అనుమతులు లేవని స్పష్టం చేస్తూ ముగ్గురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను సీజేపీ తీవ్రంగా ఖండించింది:
  • నాయకులు నిరసన వేదిక వద్దకు చేరుకోకుండా అడ్డుకోవడానికే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ అరెస్టులకు పాల్పడిందని ఆరోపించింది.
  • భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛా సంచార హక్కును (Freedom of Movement) యథేచ్ఛగా కాలరాశారని విమర్శిస్తూ, అరెస్ట్ చేసిన ముగ్గురు నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అక్రమాలు, కొత్త ఓటర్ల నమోదుకు వాడే ఫారం-6 మార్పులపై నిలదీస్తూ సీజేపీ పిలుపునిచ్చిన ఈ పోరాటం.. నాయకత్వ అరెస్టులతో మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *