శనివారం తెల్లవారుజామున హర్యానాలోని గురుగ్రామ్ సెక్టార్-56 పరిధిలోని ఆయన నివాసం నుంచి ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ధ్రువ్ రాఠీని నిర్బంధంలోకి తీసుకుని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారు.
తెల్లవారుజామునే 50 మంది పోలీసులు – ఏం జరిగింది?..
గురుగ్రామ్ సెక్టార్-56లోని సెంట్రల్ పార్క్ విహార్ ఫ్లాట్‌లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ధ్రువ్ రాఠీ ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచే దాదాపు 50 మంది పోలీసు సిబ్బంది మోహరించారు. శనివారం ఉదయం సుమారు 7:48 గంటల సమయంలో తల్లి తలుపు తీయగానే పోలీసులు లోపలికి ప్రవేశించి ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఆయనను గురుగ్రామ్‌లోని వేరొక సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
నిరసన కోసమే భారత్‌కు రాక..
కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసే ధ్రువ్ రాఠీ.. జర్మనీ నుంచి ఇటీవల భారత్‌కు వచ్చారు. అక్టోబర్ 8న బెంగళూరులో జరిగిన సీజేపీ నిరసనలో పాల్గొన్న ఆయన, శనివారం జంతర్ మంతర్ వద్ద జరగనున్న ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు.
ఆంక్షలను ప్రశ్నిస్తూ ‘కర్తవ్య పథ్’ వద్ద వీడియో..
శుక్రవారం సాయంత్రం ధ్రువ్ రాఠీ ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద చిత్రీకరించిన(రికార్డు) వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్, ‘X’ ఖాతాల్లో పోస్ట్ చేశారు..
శాంతియుత నిరసనను అడ్డుకోవడానికి మెట్రో స్టేషన్లను మూసేయడం, రైళ్లను రద్దు చేయడం, ఇంటర్నెట్ నిలిపివేయడం వంటి తీవ్రమైన ఆంక్షలను ఆయన ప్రశ్నించారు. శనివారం జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలో తాను స్వయంగా పాల్గొంటున్నట్లు ఆ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఆయనను నిర్బంధించారు. యూట్యూబ్‌లో 3.3 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ధ్రువ్ రాఠీ పిలుపుతో పెద్ద సంఖ్యలో యువత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు.
ఢిల్లీ సరిహద్దుల్లో హై అలర్ట్ – 400 మందికి పైగా నిర్బంధం..
ధ్రువ్ రాఠీని అక్రమంగా నిర్బంధించారని సీజేపీ మండిపడింది. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఢిల్లీ పోలీసులు ఈ ప్రదర్శనకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేస్తూ రాజధాని నలుమూలలా 20 వేల మందికి పైగా భద్రతా బలగాలను మోహరించారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటివరకు సుమారు 400 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.