Rahul Gandhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో విపక్షాల నిరసనలు, పోలీసులు విధించిన కఠిన ఆంక్షల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మహిళా పోలీసు సిబ్బందిపై వేధింపులు, దాడులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తీవ్ర ఆరోపణలు చేశారు.
అక్టోబర్ 10న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తలపెట్టిన నిరసన దృష్ట్యా ఢిల్లీ పోలీసులు విధించిన రవాణా ఆంక్షలు, మెట్రో మూసివేతలు, రైళ్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
మహిళా పోలీసులపై దాడి చేశారు.. సుప్రీంకోర్టులో ఎస్జీ తుషార్ మెహతా వాదనలు
రెండు రోజుల క్రితం జరిగిన దృశ్యాలను పరిశీలించండి. నిరసనకారులు మహిళా పోలీసు అధికారులను వేధించారు, వారిపై దాడులు చేసి గాయపరిచారు” అని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పోలీసులను అసభ్య పదజాలంతో దూషించినప్పటికీ సిబ్బంది సంయమనంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని తెలిపారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించిన ఆ నిరసన పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నగరంలో కఠిన నిబంధనలు అమలు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ చర్యలను సమర్థించారు.
ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు ప్రశ్నలు.. హక్కుల సమతుల్యత ముఖ్యం
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, ప్రశాంత్ భూషణ్, బృందా గ్రోవర్, గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, సరిహద్దుల దిగ్బంధం, హోటల్ బుకింగ్స్‌పై ఆంక్షలు వంటి చర్యల వల్ల లక్షలాది మంది సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ కీలక పరిశీలనలు చేసింది.
ప్రజల సాధారణ జీవనానికి ఆటంకం కలగకూడదు.
నిరసన తెలిపే హక్కు ఎంత ముఖ్యమో.. సాధారణ పౌరులు స్వేచ్ఛగా తిరిగే, నిత్యావసర సౌకర్యాలను పొందే హక్కు కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉండాలి” అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు.
కోర్టు ముందుంచిన ఆధారాల ప్రకారం పోలీసుల చర్యలు అవసరానికి మించి తీవ్రంగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని జస్టిస్ జోయ్మల్యా బాగ్చి వ్యాఖ్యానించారు. అసలు ఆంక్షలకు సంబంధించి పోలీసులు జారీ చేసిన అధికారిక ఉత్తర్వులను కోర్టు ముందుంచాలని ఆదేశించారు. నిరసనకారులు నిరాయుధులుగా ఉండాలని, పరిమిత సంఖ్యతో శాంతియుతంగా కొనసాగాలని స్పష్టం చేస్తూ.. హైవేలను స్తంభింపజేయడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీపై బీజేపీ ఆరోపణలు..
బుధవారం నాటి నిరసనల సందర్భంగా అశోకా రోడ్డు వద్ద జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీస్ అధికారితో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ ఆరోపించింది. ఓ మహిళా ఆందోళనకారిణిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ లేడీ ఆఫీసర్‌ను నెట్టేసేందుకు యత్నించారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఒక వీడియో క్లిప్‌ను ‘X’లో షేర్ చేశారు.
రాహుల్ గాంధీ వెంటనే మహిళా పోలీసులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్లపై విపక్షాల పోరాటం, తాజా సుప్రీంకోర్టు విచారణతో ఢిల్లీ వేదికగా రాజకీయ, న్యాయ పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది.
