UPI MDR Fee

UPI MDR Fee: యూపీఐ తో తిప్పలు.. ఇకపైన క్యాష్ తోనే పేమెంట్ కావాలంటున్న స్కూల్ బస్ ఓనర్లు..!

UPI MDR Fee: రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ (UPI) లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు అమల్లోకి రానుండటం దేశవ్యాప్తంగా వ్యాపార, రవాణా రంగాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలోని స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు తీవ్ర అసౌకర్యం కలిగించేలా స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ (SBOA) సంచలన నిర్ణయం తీసుకుంది.అక్టోబర్ 15వ తేదీ నుంచి స్కూల్ బస్సుల ఫీజులను గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐ విధానాల ద్వారా స్వీకరించేది లేదని అసోసియేషన్ అధికారిక సర్క్యులర్ జారీ చేసింది.

యూపీఐ బంద్ చేయడానికి అసలు కారణమేంటి?

స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం. కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై పేమెంట్ గేట్‌వేలు ఒక్కో లావాదేవీకి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు కనీసం ఆరు నెలల స్కూల్ బస్ ఫీజులను ఒకేసారి చెల్లిస్తుంటారు. ఈ మొత్తం కచ్చితంగా రూ.2,000 కంటే ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల యూపీఐ ద్వారా వచ్చే వసూళ్లపై తాము భారీగా సేవా రుసుములు చెల్లించాల్సి వస్తుందని, ఇది తమకు ఆర్థికంగా మోయలేని భారంగా మారుతోందని బస్ ఆపరేటర్లు స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు ఫీజులు ఎలా కట్టాలి?

ఇప్పటివరకు డిజిటల్ పేమెంట్స్‌తో చిటికెలో ఫీజులు చెల్లించే విధానానికి అలవాటుపడిన వేలాది మంది తల్లిదండ్రులు ఇకపై ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. యూపీఐ బంద్‌తో తల్లిదండ్రులు ఫీజులను నేరుగా నగదు (Cash), చెక్కులు (Cheques) లేదా క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలని అసోసియేషన్ సూచించింది. తల్లిదండ్రులు ఫీజులు చెల్లించే ముందు తమ పిల్లల స్కూల్ బస్ ఆపరేటర్లను సంప్రదించి, వారు అనుమతించే చెల్లింపు విధానాలను ముందుగానే తెలుసుకోవాలని కోరారు.
అత్యవసర సేవలుగా గుర్తించాలి – కేంద్రానికి ఎస్‌బీవోఏ విజ్ఞప్తి..
ఈ ఛార్జీల వ్యవహారంపై స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ గార్గ్ స్పందిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రికి ఇప్పటికే విజ్ఞప్తి పంపినట్లు తెలిపారు. స్కూల్ బస్సులు, పెట్రోల్ బంకులు, వాహన విడిభాగాల (స్పేర్ పార్ట్స్) వ్యాపారాలను అత్యవసర సేవలుగా (Essential Services) పరిగణించి, ఈ ఎండీఆర్ లావాదేవీ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలని కోరారు.
ఈ నిబంధనల కారణంగా తమకు ఇంధనం పోసే పెట్రోల్ బంకులు, బస్సుల విడిభాగాలను విక్రయించే డీలర్లు సైతం యూపీఐ పేమెంట్స్ తీసుకోవడానికి ససేమిరా అంటున్నారని అసోసియేషన్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం గనుక ఈ అదనపు ఛార్జీల నుంచి బస్సులకు మినహాయింపు ఇవ్వకపోతే, భవిష్యత్తులో యూపీఐ ద్వారా ఫీజుల స్వీకరణను శాశ్వతంగా నిలిపివేస్తామని హెచ్చరించింది. మహారాష్ట్రలో మొదలైన ఈ ‘నో యూపీఐ’ సెగ.. రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఇతర రంగాలకు కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *