Danam Nagender: హైదరాబాద్ నగరంలోని కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నేరుగా సవాల్ విసిరారు. గురువారం ‘ఇండియా’ (INDIA) కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీలో పాల్గొన్న దానం నాగేందర్.. ఖైరతాబాద్ బైపోల్ వేదికగా బీఆర్ఎస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు.
ధైర్యముంటే నాపై పోటీ చేయ్.. కేటీఆర్‌కు దానం ఓపెన్ ఛాలెంజ్
కేటీఆర్‌కు దమ్ముంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో తనపై నేరుగా పోటీకి దిగాలని దానం నాగేందర్ సవాల్ విసిరారు. “బైపోల్‌కు నేను నూరు శాతం సిద్ధంగా ఉన్నాను. ఎవరు గెలుస్తారో, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ఈ ఎన్నికల సమరంలో తాడోపేడో తేల్చుకుందాం” అని ఘాటుగా స్పష్టం చేశారు.
దానం అంటేనే ఒక బ్రాండ్..
తాను ఏ పార్టీలో ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రజలతోనే ఉంటానని.. “దానం నాగేందర్ అంటేనే హైదరాబాద్ రాజకీయాల్లో ఒక బ్రాండ్” అంటూ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నిక తమ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు నిజమైన రెఫరెండం (ప్రజా తీర్పు) కాబోతోందని తేల్చిచెప్పారు.
ఈసీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీరుపై తీవ్ర ఆగ్రహం..
ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) విధానంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలకు దానం నాగేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజల ప్రాథమిక ఓటు హక్కును కాలరాసే అధికారం ఎన్నికల సంఘానికి ఎక్కడిదని ప్రశ్నించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు ఆ అధికారం ఎవరిచ్చారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీకి పెరుగుతున్న మద్దతు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒంటరిగా పోరాడటం లేదని, ఇండియా కూటమి ఎంపీలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఆయనకు బాసటగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఖైరతాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి తీరుతామని, ఈ ఉప ఎన్నిక తీర్పు ద్వారా విపక్షాలకు ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.
