Trip Planning Trend: ఒకప్పుడు హాలిడేస్ వచ్చాయంటే.. ముందుగా గోవానో, జైపూరో, లేదా దుబాయ్ లాంటి ప్లేసో ఫిక్స్ చేసుకునేవాళ్లు. ఆ తర్వాత ఫ్లైట్ లేదా ట్రైన్ టికెట్లు, హోటళ్లు బుక్ చేసుకుని.. అక్కడికి వెళ్లాక “సరే, ఇక్కడ ఏమేం చూడాలి?” అని లిస్ట్ రాసుకునేవాళ్లు. కానీ నేటి తరం యువత (GenZ) మాత్రం ఈ పాత ట్రెండ్‌ను పూర్తిగా తలకిందులు చేసింది!
ఇప్పుడు వాళ్లకి ఎక్కడికి వెళ్తున్నామన్న ‘లొకేషన్’ ముఖ్యం కాదు.. అక్కడికి వెళ్తే మనకు దక్కే ‘అనుభవం’ (Experience) ఏంటి అన్నదే అసలు పాయింట్. అంటే ప్లానింగ్ మొత్తం మొదలయ్యేదే ఒక మ్యూజిక్ కాన్సర్ట్ టికెట్తోనో, ఫుడ్ ఫెస్టివల్తోనో లేదా ఏదైనా థీమ్ పార్క్తోనో! గమ్యస్థానం అనేది ఆ తర్వాత వచ్చే బోనస్ మాత్రమే.
“ఎక్కడికి వెళ్లాలి?” కాదు.. “ఏం చేయాలి?”
ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ‘ఎయిర్‌బీఎన్‌బీ’ (Airbnb) విడుదల చేసిన 2026 ‘ఎక్స్పీరియన్స్ లెడ్ ట్రావెల్ ఇన్సైట్స్’ రీసెర్చ్ ప్రకారం GenZ ఆలోచనల్లో వచ్చిన కీలక మార్పులు ఇవే.
లాంగ్ టూర్స్ బంద్ – 3 రోజుల ట్రిప్సే ట్రెండ్..
పది మందిలో ఏడుగురు భారతీయ యువ ప్రయాణికులు ఏడు రోజుల పాటు మూడు సూట్‌కేసులు సర్దుకుని వెళ్లే వార్షిక పర్యటనల కంటే.. కేవలం 3 రోజుల పాటు ఉండే చిన్నపాటి వీకెండ్ ట్రిప్పులకే మొగ్గు చూపుతున్నారు.
చిన్న క్షణాలకే ఎక్కువ విలువిస్తారు..
దాదాపు 80 శాతం మంది యువత.. పేరుమోసిన పర్యాటక ప్రదేశాలు, తాజ్‌మహల్ లాంటి ల్యాండ్‌మార్క్‌లను చూసి ఫోటోలు దిగడం కంటే, ట్రిప్‌లో దొరికే చిన్నపాటి మధురానుభూతులే తమకు ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.
కాన్సర్ట్ టికెట్ ముందు.. ఫ్లైట్ బుకింగ్ తర్వాత!
ఈ ఎక్స్పీరియన్స్ ఆధారిత పర్యటనల్లో మ్యూజిక్ కాన్సర్ట్స్ సరికొత్త విప్లవాన్ని సృష్టించాయి. 62 శాతం మంది GenZ కుర్రాళ్లు కేవలం ఏదైనా కాన్సర్ట్ లేదా మ్యూజిక్ ఫెస్టివల్ అటెండ్ అవ్వడానికే వేరే నగరాలకు లేదా దేశాలకు ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నారు.
వీరిలో 76 శాతం మంది తాము ఆ కాన్సర్ట్ లేదా ఈవెంట్ కారణంగానే జీవితంలో మొదటిసారి ఆ నగరానికి వెళ్లామని చెప్పారు. అంతటితో ఆగకుండా, సగానికి పైగా యువత ఆ ఈవెంట్ ముగిశాక నగరంలోని లోకల్ కేఫ్‌లు, స్ట్రీట్ మార్కెట్లు, రహస్య ప్రదేశాలను చూడటానికి తమ స్టేను మరో రోజు పొడిగించుకుంటున్నారు.ఒక ఈవెంట్ వారిని ఊరికి తీసుకెళ్తోంది.. ఆ ఊరు వారిని తన అందాలతో అక్కడే కట్టిపడేస్తోంది!
వీకెండ్ గెట్అవేస్ – సరదాగా రోడ్ ట్రిప్పులు..
GenZ ప్రయాణాల లిస్ట్ చాలా సింపుల్‌గా, పక్కా రీజన్‌తో ఉంటోంది.
-
ఏదైనా ఫేవరెట్ సింగర్ లైవ్ షో కోసం వేరే ఊరికి వెళ్లి ఒక రాత్రి ఎక్స్ట్రా ఉండటం.
-
ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఒక థీమ్ పార్క్ చుట్టూ వీకెండ్ ప్లాన్ చేసుకోవడం.
-
ఫేమస్ ఫుడ్ ఫెస్టివల్ కోసం కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం.
-
బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వడానికి వెల్నెస్ రిసార్ట్‌లో రెండు రాత్రులు గడపడం.
-
ఏదైనా ఐపీఎల్ లేదా స్పోర్ట్స్ ఈవెంట్ కోసం ట్రావెల్ చేయడం.
-
ఇన్‌స్టాగ్రామ్‌లో సేవ్ చేసుకున్న ఒక వైరల్ ఎక్స్పీరియన్స్ కోసం ఆ ఊరికి టికెట్ కొట్టడం.
దేశీయ పర్యాటక రంగానికి సరికొత్త బూస్ట్..
ఈ మార్పు భారతీయ దేశీయ పర్యాటకానికి (Domestic Tourism) ఒక పెద్ద వరంలా మారుతోంది. ఇకపై నగరాలు కేవలం పాత చారిత్రక కట్టడాల మీదో, బీచ్‌ల మీదో ఆధారపడాల్సిన అవసరం లేదు. నగరాల్లో జరిగే ఫెస్టివల్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, వెల్నెస్ సెంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలే పర్యాటకులను ఆకర్షించే ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయి. కాబట్టి మీ నెక్స్ట్ ట్రిప్ కూడా గూగుల్ మ్యాప్స్‌లో ప్లేస్ వెతకడంతో మొదలుకాకపోవచ్చు.. మీ ఈమెయిల్లో ఉన్న ఏదో ఒక కాన్సర్ట్ టికెట్‌తోనే మీ బ్యాగ్ ప్యాకింగ్ మొదలవుతుందేమో చెక్ చేసుకోండి!
