Asian Games Cricket

Asian Games Cricket: గోల్డ్ మెడల్ కి ఒక్క అడుగు దూరంలో భారత్..?

Asian Games Cricket: జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ విభాగంలో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హై-వోల్టేజ్ పోరు ఖరారైంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 124 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించిన టీమిండియా నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. అక్టోబర్ 3న ఉదయం 10 గంటలకు జరగనున్న బంగారు పతక పోరులో (Gold Medal Match) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌‌పై వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించి ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

ఇషాన్ కిషన్ విశ్వరూపం – 169 పరుగులు చేసిన భారత్..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు పిచ్ నుంచి తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఒంటిచేత్తో లంక బౌలర్లను చీల్చిచెండాడాడు.
  • ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్: కేవలం 46 బంతుల్లోనే 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. క్లిష్టమైన పిచ్‌పై బాధ్యతాయుతంగా ఆడుతూనే భారీ షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.
  • వైభవ్ సూర్యవంశీ మెరుపులు: యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 38 పరుగులతో చక్కటి సహకారం అందించాడు.

    మిగతా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (7), సంజూ శాంసన్ (7), శ్రేయస్ అయ్యర్ (13), అక్షర్ పటేల్ (8), తిలక్ వర్మ (2), శివమ్ దూబే (3), వాషింగ్టన్ సుందర్ (7 నాటౌట్) పెద్దగా రాణించలేకపోయినప్పటికీ.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగుల పటిష్ట స్కోరును నమోదు చేసింది.

లంక పేకమేడలా కుప్పకూలింది – 45 రన్స్‌కే ఆలౌట్..

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి లంక పవర్‌ప్లే ముగిసేసరికే 33 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
భారత బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను తట్టుకోలేక శ్రీలంక కేవలం 9.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. లంక జట్టులో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. నువనిదు ఫెర్నాండో (15) ఒక్కడే రెండంకెల స్కోరు దాటగలిగాడు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ తలో 2 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
గోల్డ్ మెడల్ కోసం భారత్ వర్సెస్ పాక్ – రూల్స్ ఏంటి?..
  • పాకిస్తాన్ సెమీస్ దారి: అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో సాహిబ్‌జాదా ఫర్హాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో 111 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.3 ఓవర్లలోనే ఛేదించి బంగ్లాదేశ్‌పై గెలుపొందింది.
  • వర్షం పడితే ఏమవుతుంది?: అక్టోబర్ 3న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు స్వర్ణం, ఓడిన జట్టుకు రజతం (సిల్వర్) దక్కుతుంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే.. ఏ ఒక్క జట్టుకో కాకుండా భారత్, పాకిస్తాన్ జట్లు సంయుక్తంగా స్వర్ణ పతకాన్ని పంచుకుంటాయి.
  • కాంస్య పతక పోరు: సెమీఫైనల్స్‌‌లో ఓడిన బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కాంస్య పతకం (Bronze Medal) కోసం అక్టోబర్ 3న ఉదయం 5:30 గంటలకు తలపడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *