Nara Lokesh: మంగళగిరి ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 80 శాతం మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేశామని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చెప్పారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జరిగిన ‘మన ఇల్లు – మన లోకేశ్’ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని, సోమవారం మరో 372 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలను స్వయంగా అందించారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని జీవిస్తున్న పేద కుటుంబాలకు పూర్తి హక్కులు కల్పిస్తూ.. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన భూములను ఉచితంగా ఇచ్చినట్లు తెలిపారు.
మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ వివరాలు..
మొదటి రెండు విడతల్లో కలిపి ఇప్పటికే 5,636 మందికి పట్టాలు అందజేశారు. మొదటి విడతలో 3,002 మందికి, రెండో విడతలో 2,634 మందికి పూర్తి హక్కులతో కూడిన పేపర్లు ఇచ్చారు.
అటవీ, రెవెన్యూ, కాలువలు, దేవాలయాలు, రోడ్లు, పంచాయతీ భూముల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదల ఇబ్బందులను గుర్తించి, సంబంధిత అధికారులందరినీ ఒకచోటకు చేర్చి సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న కేంద్ర ప్రభుత్వ భూముల సమస్యలపైనా కేంద్రంతో నిరంతరం మాట్లాడుతున్నామని, త్వరలోనే వాటినీ పరిష్కరిస్తామని చెప్పారు.
2019లో ఓడిపోయినా భయపడలేదు.. నిలబడి గెలిచా..
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు తాను నిరాశ చెందలేదని, ఇక్కడే ఉండి ప్రజల సమస్యలు తీర్చాలని పట్టుదలతో పనిచేశానని చెప్పారు. ఎన్నికల టైంలో ఏవైతే హామీలు ఇచ్చానో.. వాటిని ఇప్పుడు నెరవేరుస్తున్నానని అన్నారు. మంగళగిరిలో చేసినట్లే.. త్వరలోనే విజయవాడలోని నిరుపేదల కోసం 24,000 ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేయబోతున్నామని హామీ ఇచ్చారు.
2029 నాటికి మంగళగిరి కోసం ప్లాన్..
స్థానిక ప్రజలకు మంచి వైద్యం అందేలా మంగళగిరిలో 100 పడకల పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. 2029 కల్లా మంగళగిరిలోని ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్, మంచి తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిడమర్రు ప్రభుత్వ బడిని ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దామని, అదే మోడల్‌లో నియోజకవర్గంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లను మార్చేస్తామని స్పష్టం చేశారు.
