Cotton Candy: చిన్నప్పుడు జాతరలు, తిరునాళ్లకు వెళ్లినప్పుడు కర్రకు చుట్టిన గుండ్రటి దూది లాంటి తీపి మిఠాయిని మనమందరం ఎప్పుడో ఒకప్పుడు తినే ఉంటాం. సాధారణంగా మన ఊళ్లలో దీన్ని ‘పీచు మిఠాయి’ లేదా ‘బొంబాయి మిఠాయి’ అని పిలుస్తుంటారు. నోట్లో వేస్తే కరిగిపోయే ఈ స్వీట్ నేటికీ పిల్లలకు ఎంతో ఇష్టం. అయితే దూదిలా మెత్తగా ఉండే ఈ తీపి మిఠాయిని ఎవరు కనిపెట్టారు? దీని వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసా?
మిఠాయిని కనిపెట్టింది పళ్ల డాక్టర్!
మనం ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయి మొదటిసారిగా అమెరికాలో తయారైంది. దీన్ని విలియం జేమ్స్ మోరిసన్ అనే దంత వైద్యుడు (డెంటిస్ట్) కనిపెట్టడం విశేషం. ఆయనకు కొత్త వస్తువులను కనిపెట్టడం చాలా ఇష్టమైన వ్యాపకం.
1897లో తొలి యంత్రం..
1897లో జేమ్స్ మోరిసన్, జాన్ సి వార్టన్ అనే మిఠాయిల తయారీదారుడితో (హల్వాయ్) కలిసి ఒక వినూత్న యంత్రాన్ని తయారు చేశారు. వేడి చేసిన చక్కెరను వేగంగా గుండ్రంగా తిప్పుతూ సన్నటి తీగల రూపంలోకి మార్చి ఈ మిఠాయిని సిద్ధం చేసేవారు.
తొలి ప్రదర్శనలోనే కాసుల వర్షం..
ప్రారంభంలో ఈ మిఠాయి పూర్తిగా తెల్ల రంగులోనే ఉండేది. ఆ తర్వాత ఆకర్షణీయమైన లేత గులాబీ (పింక్), లేత నీలం రంగుల్లోకి మారింది. దాదాపు 120 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ.. ఇప్పటికీ పిల్లల్లో పీచు మిఠాయిపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
