Congo Plane Crash

Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి..!

Congo Plane Crash: ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో పెను విషాదం చోటుచేసుకుంది. సైన్యానికి చెందిన కీలక ప్రతినిధి బృందంతో ప్రయాణిస్తున్న విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అత్యున్నత స్థాయి మిలిటరీ జనరల్స్ సహా విమానంలో ఉన్న మొత్తం 14 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. రాజధాని కిన్షాసాకు తిరిగి వస్తున్న సమయంలో కేంగే (Kenge) ప్రాంత సమీపంలో ఈ ఘోరం జరిగింది.

ప్రమాదం జరిగిందిలా..

కాంగో సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమీ ఎకెంగే వివరాల ప్రకారం.. నైరుతి కాంగోలోని కిక్విట్ (Kikwit) నుంచి రాజధాని కిన్షాసాకు ప్రతినిధి బృందంతో విమానం బయలుదేరింది. మార్గమధ్యంలో కేంగే సమీపంలోకి రాగానే విమానంలో తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ నియంత్రణ కోల్పోవడంతో క్షణాల్లో నేలను ఢీకొట్టి కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు.
ఈ దుర్ఘటనలో కాంగో సైన్యానికి చెందిన కీలక అధికారులు మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించారు.. లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటాలాయి టియెండే  కాంగో మిలిటరీ కోర్టు అధిపతిగా (Head of Military Court) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా సాయుధ దళాల ఆడిటర్ జనరల్‌గా (Auditor General of the Armed Forces) సేవలందిస్తున్నారు. వీరితో పాటు ప్రతినిధి బృందంలోని మరో 12 మంది అధికారులు, విమాన సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
కాంగో సైన్యానికి తీరని లోటు – విచారణకు ఆదేశం..
కాంగో సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ ట్రైఫోన్ కిన్-కి ములుంబా మాట్లాడుతూ.. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు వెంటనే గుర్తించలేకపోయామని, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. సాంకేతిక లోపమే ప్రాథమిక కారణంగా భావిస్తున్నారు.

తూర్పు కాంగో ప్రాంతంలో రువాండా మద్దతున్న ‘M23’ వంటి తిరుగుబాటు దళాలతో సైన్యం భీకర పోరాటం సాగిస్తున్న క్లిష్ట సమయంలో.. ఇద్దరు కీలక సైనిక న్యాయ, పరిపాలనా ఉన్నతాధికారులను కోల్పోవడం కాంగో సైన్యానికి తీరని నష్టంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *