Kavach 4.0: రైలు ప్రమాదాలను పూర్తిగా అరికట్టి, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించే దిశగా దక్షిణ మధ్య రైల్వే (SCR) సరికొత్త మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి–కామారెడ్డి సెక్షన్లో 108 కిలోమీటర్ల మేర స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ను మునుపటి వెర్షన్ 3.2 నుంచి అత్యంత ఆధునికమైన ‘కవచ్ 4.0’ (Kavach Version 4.0)కు విజయవంతంగా అప్‌గ్రేడ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో కవచ్ లేటెస్ట్ వెర్షన్-4.0ను అమల్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అప్‌గ్రేడ్ పనులను ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ (GM) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
కవచ్ 4.0 ప్రత్యేకతలు – ఎలా పనిచేస్తుంది?
-
ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్:లోకో పైలట్ మానవ తప్పిదం వల్ల ఎరుపు రంగు సిగ్నల్ దాటి ముందుకు వెళ్లినా (SPAD) లేదా పరిమితికి మించి వేగంతో రైలును నడిపినా.. కవచ్ వెంటనే స్పందించి ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది.
-
ఎదురెదురు రైళ్ల ప్రమాదాలకు చెక్:ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎదురెదురుగా లేదా వెనుక నుంచి వేగంగా దూసుకొస్తే, నిర్దిష్ట దూరంలోనే వాటంతట అవే ఆగిపోయేలా ఈ వ్యవస్థ భద్రతా కవచాన్ని అందిస్తుంది.
-
పొగమంచు, భారీ వర్షాల్లోనూ నిర్భయంగా:దట్టమైన పొగమంచు లేదా వర్షాల వల్ల లోకో పైలట్లకు సిగ్నల్స్ సరిగ్గా కనిపించని సమయంలో కూడా ఇంజిన్ క్యాబిన్‌లోని డిస్ప్లే ద్వారా స్పష్టమైన సిగ్నలింగ్ సమాచారాన్ని అందిస్తుంది.
-
కవచ్ 4.0లోని మార్పులు:గత వెర్షన్ 3.2 కంటే ఇది మరింత కచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ కలిగి ఉంటుంది. పెద్ద రైల్వే యార్డుల్లో సిగ్నల్ ట్రాన్స్మిషన్ సులభతరం చేయడంతో పాటు స్టేషన్ల మధ్య ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) ద్వారా వేగవంతమైన కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌తో నేరుగా అనుసంధానం చేయబడింది.
అమృత్ భారత్ స్టేషన్ల పనుల సమీక్ష..
-
పునరాభివృద్ధి పనులు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద జరుగుతున్న స్టేషన్ల ఆధునీకరణ పనుల పురోగతిని సమీక్షించారు.
-
ప్రయాణికుల వసతులు: సర్క్యులేటింగ్ ఏరియాలు, ప్లాట్‌ఫారమ్‌లు, ప్రయాణికుల మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
-
ఈ పర్యటనలో ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ పి.వి. మురళీకృష్ణ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) సంతోష్ కుమార్ వర్మతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గతంలో ఎస్సీఆర్ పరిధిలో 1,465 కిలోమీటర్ల మేర కవచ్ 3.2ను విజయవంతంగా నడిపిన రైల్వే శాఖ.. తాజా కవచ్ 4.0ను దశలవారీగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైలు మార్గాల్లోనూ విస్తరించేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది.
