Khairatabad Ganesh: భాగ్యనగరంలో వినాయక నిమజ్జన కోలాహలం తారస్థాయికి చేరింది. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. 69 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించిన టస్కర్ వాహనంపైకి ఎక్కించి, విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు పూర్తి చేసిన అనంతరం శోభాయాత్ర ముందుకు కదిలింది. ఉదయం 6 గంటలకే మొదలుకావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యంగా మొదలైంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా నిమజ్జన ఘట్టాన్ని పూర్తి చేసేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
శోభాయాత్ర సాగే మార్గం – నిమజ్జన ఏర్పాట్లు..
యాత్ర సాగే రూట్
ఖైరతాబాద్ మండపం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోనుంది.
క్రేన్ నంబర్ 5 వద్ద నిమజ్జనం
హుస్సేన్‌సాగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద 69 అడుగుల మహాగణపతి నిమజ్జనం కోసం భారీ క్రేన్లను సిద్ధం చేశారు. క్రేన్ నంబర్ 5 వద్ద మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జలప్రవేశం చేయించనున్నారు.
టస్కర్ ఎదుట డ్యాన్స్ చేసిన దానం నాగేందర్
శోభాయాత్ర ప్రారంభ వేళ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ టస్కర్ వాహనం ముందు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య మహాగణపతి ఎదుట ఉత్సాహంగా డ్యాన్స్ చేసి భక్తుల్లో జోష్ నింపారు.
45 వేల మంది పోలీసులతో కనీవినీ ఎరుగని భద్రత
లక్షలాదిగా తరలివస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ అసాధారణ రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసింది.
-
భారీ బందోబస్తు: నాలుగు కమిషనరేట్ల పరిధిలో కలిపి సుమారు 45,000 మంది పోలీసులను మోహరించారు. ఒక్క హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోనే వెయ్యి మందికి పైగా సిబ్బంది విధుల్లో ఉన్నారు.
-
10 వేల సీసీ కెమెరాలతో నిఘా: నగరం నలుమూలలా 10,000 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ట్యాంక్‌బండ్ చుట్టూ ప్రత్యేకంగా 100 హైరైజ్ కెమెరాలను అమర్చారు.
-
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: నిమజ్జనానికి వచ్చే భక్తుల రాకపోకల కోసం ఆర్టీసీ 700 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
