Army Weapons Theft Case

Army Weapons Theft Case: 4 నెలల పక్కా ప్లాన్.. కక్షతోనే ఆయుధాలు ఎత్తుకెళ్లిన మాజీ హవాల్దార్ మల్లేశ్..!

Army Weapons Theft Case: హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ సెంటర్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఉద్యోగం నుంచి తొలగించబడిన మాజీ హవాల్దార్ మల్లేశ్‌ను చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, 10 రోజుల పాటు సాగనున్న పోలీసు విచారణ మొదలైంది. అసలు చోరీ వెనుక ఉన్న ఉద్దేశం, ఆయుధాగారంలోకి ప్రవేశించిన తీరుపై క్లారిటీ కోసం క్రైమ్ సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ (Scene Re-construction) చేసేందుకు దర్యాప్తు బృందాలు సిద్ధమవుతున్నాయి.

4 నెలల పక్కా ప్లాన్ – ఆదివారం ఎంచుకోవడానికి కారణమిదే..

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మల్లేశ్ పన్నిన పన్నాగం బట్టబయలైంది.. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు మల్లేశ్ సుమారు నాలుగు నెలల ముందే పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.
ఆదివారం పూట గార్డ్ ఇన్‌ఛార్జ్‌లు, ఆర్మీ ఉన్నతాధికారుల కదలికలు చాలా తక్కువగా ఉంటాయని పసిగట్టి, ఆ రోజే చోరీకి అనువైన సమయంగా ఎంచుకున్నాడు. చోరీ చేసిన ఆయుధాలను సంఘ విద్రోహ శక్తులకు విక్రయించి, తనకున్న భారీ ఆర్థిక నష్టాలను పూడ్చుకోవాలని భావించాడు.
ఇందుకోసం ఆయుధాలు కొనాలనుకునే వ్యక్తుల కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేసినట్లు వెల్లడైంది. సర్వీస్ ఇంకా మూడేళ్లు మిగిలి ఉన్నప్పటికీ, విధుల్లో నిర్లక్ష్యం పేరిట జూన్ నెలలో ఆర్మీ అధికారులు తనను సర్వీస్ నుంచి తొలగించారు. దీంతో అధికారులపై తీవ్ర కక్ష పెంచుకున్న మల్లేశ్.. ఎలాగైనా బెటాలియన్ నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లి ఉన్నతాధికారుల పరువు తీయాలని వ్యూహం రచించాడు.

16 ఏళ్ల అనుభవం – ఆర్మీ మిత్రులతో రహస్య సంభాషణలు..

మద్రాస్ రెజిమెంట్‌లో ఏకంగా 16 ఏళ్ల పాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉండటంతో.. ఆయుధాగారానికి సంబంధించిన ప్రతి చిన్న లొసుగు మల్లేశ్‌కు కొట్టినపిండి. ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న తన స్నేహితులు నాయక్ వినోద్, మ్యాగజైన్ ఇన్‌ఛార్జ్ బల్లి మధు, గార్డ్ ఇన్‌ఛార్జ్ హవాల్దార్ కేవీ రమణ, క్వార్టర్ గార్డ్ ఇన్‌ఛార్జ్ నిరేష్‌లతో తరచూ ఫోన్లలో మాట్లాడాడు. సీసీ కెమెరాలను ఎప్పుడు ఆఫ్ చేస్తారు? సెక్యూరిటీ ఎప్పుడు తక్కువగా ఉంటుంది? అనే విషయాలపై ఆరా తీసి చోరీకి పథకం అమలు చేశాడు.
అసలేం జరిగింది? – కేసు పూర్వాపరాలు..
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆగస్టు 30 సాయంత్రం నుంచి 31 ఉదయం మధ్య ఆయుధాలు చోరీకి గురైనట్లు లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవిటీర్కార్ బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.మొత్తం 12 తుపాకులు (ఏకే-47, పిస్టల్స్ సహా), 21 మ్యాగజైన్లు, ఒక నైట్ విజన్ బైనాక్యులర్ మరియు 1,912 రౌండ్ల లైవ్ మందుగుండు సామగ్రి మాయమయ్యాయి.ఆర్మీ కేంద్రంలో ఇంత భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడంతో ఢిల్లీ నుంచి మిలిటరీ ఇంటెలిజెన్స్ (MI), ఎన్‌ఐఏ (NIA), హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, మల్కాజ్‌గిరి పోలీసులు రంగంలోకి దిగారు.
సొంతూరులో గొయ్యి తీసి దాచివేత – డేటా రికవరీపై నజర్..
ఈనెల 11న మల్లేశ్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ బృందం.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని అతని స్వగ్రామం జంగంరెడ్డిపల్లికి తీసుకెళ్లింది. అక్కడ కారులో తీసుకొచ్చి రహస్యంగా నేలలో గుంత తీసి పాతిపెట్టిన ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు తరచూ ఆయుధాలు దాచిన స్థలాలను మార్చాడు.

విచారణలో హాలీవుడ్ సినిమాల పిచ్చి వల్ల తుపాకులు దాచుకోవాలనుకున్నానని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా ఫోన్ డేటాను పూర్తిగా డిలీట్ చేయడంతో.. సైబర్ నిపుణులు డేటాను రిట్రీవ్ చేస్తున్నారు. గతంలో ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు అసాంఘిక శక్తులతో సంబంధాలు ఏమైనా ఏర్పడ్డాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *