Bandi Sanjay

Bandi Sanjay: జూరాల రైతులను పరామర్శిస్తే తప్పేంటి?.. రాంచందర్‌రావు అరెస్టును ఖండించిన బండి సంజయ్

Bandi Sanjay: జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతల గృహనిర్బంధాలు, అరెస్టులు ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బాధల్లో ఉన్న రైతులకు అండగా నిలవడానికి వెళ్తున్న నేతలను నిర్బంధించడం దారుణమని, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య పాలన అమలవుతోందా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

జడ్చర్ల వద్ద మార్గమధ్యంలోనే అరెస్ట్ – నిరంకుశ పాలనపై ఫైర్..

పంటలు ఎండిపోయి అల్లాడుతున్న ఆయకట్టు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జూరాల ప్రాజెక్టు వైపు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర నేత ఎన్. రాంచందర్ రావును జడ్చర్ల సమీపంలో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యపై రాంచందర్ రావు మండిపడుతూ, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వానికి, నియంతృత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

రైతుల కన్నీళ్లను తుడవాల్సింది పోయి, సమస్యలను వెలుగులోకి తెస్తున్న ప్రతిపక్ష నాయకులను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన ప్రజా పోరాటాలను ఆపలేరని, బీజేపీ ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా నిలబడి ప్రభుత్వాన్ని కచ్చితంగా నిలదీస్తుందని హెచ్చరించారు.

బండి సంజయ్ డిమాండ్లు..

అక్రమంగా అరెస్టు చేసిన ఎన్. రాంచందర్‌రావుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేసిన బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

రైతుల పంటలు ఎండిపోకుండా యుద్ధప్రాతిపదికన జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు తగినంత సాగునీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో అన్నదాతల ఆగ్రహానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *