కుప్పంలో భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు..
రైతుబజార్ & మార్కెట్ యార్డ్..
రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో త్వరలోనే ఆధునిక రైతుబజార్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. మార్కెట్ యార్డులో రూ. 2.50 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
నీటి భద్రత & అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ..
రూ. 45 కోట్ల నిధులతో బీరుగానిపల్లె వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
శ్రీశైలం నీరు – మైక్రో ఇరిగేషన్..
ఎవరూ ఊహించని విధంగా శ్రీశైలం నుంచి కుప్పం వరకు కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మైక్రో ఇరిగేషన్ వినియోగంలో మనమే నంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు.
వ్యవసాయం, పాడి పరిశ్రమపై రైతన్నలకు దిశానిర్దేశం..
పాల ఉత్పత్తిలో 10 లక్షల లీటర్ల టార్గెట్..
గతంలో కుప్పంలో రోజువారీ పాల ఉత్పత్తి 4 లక్షల లీటర్ల నుంచి ప్రస్తుతం 5 లక్షల లీటర్లకు పెరిగిందని, దీనిని త్వరలోనే 7 లక్షల లీటర్లకు, భవిష్యత్తులో 10 లక్షల లీటర్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
మిల్లెట్స్ సాగు & ప్రకృతి సేద్యం..
వరికి బదులుగా చిరుధాన్యాలు (మిల్లెట్స్) సాగు చేస్తే రైతులకు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని సూచించారు. ప్రభుత్వం తరఫున 32 రకాల విత్తనాలను రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.
వర్షాభావ పరిస్థితులు..
వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గాయని, శ్రీశైలం, తుంగభద్రతో పాటు రాష్ట్ర రిజర్వాయర్లలో ప్రస్తుతం తాగునీటి అవసరాలకే నీరు సరిపోతుందని, వర్షాలు పడే వరకు ప్రతి నీటిబొట్టునూ జాగ్రత్తగా వాడుకోవాలని రైతులకు వివరించారు.
నిన్ను చూసి లెక్కలు నేర్చుకోవాలి..
లబ్ధిదారులతో ముఖాముఖిలో భాగంగా ఒక స్థానిక మహిళ ఇటుకల తయారీ ద్వారా 3 నెలలకు రూ. 4 లక్షలు, ఏడాదికి ఖర్చులు పోను నికరంగా రూ. 10 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పడంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. ఆమె బిడియపడుతుంటే.. “నువ్వు పెద్ద వ్యాపారవేత్తవి, తలెత్తుకుని గట్టిగా మాట్లాడు.. నిన్ను చూసి నేను లెక్కలు నేర్చుకోవాలి” అంటూ ఆమెను ప్రశంసించారు.
అజాన్‌కు గౌరవం..
కుప్పం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తున్న సమయంలో సమీపంలోని మసీదు నుంచి అజాన్ ప్రార్థన వినిపించింది. దీంతో చంద్రబాబు వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేసి, నమాజ్ పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా వేదికపై నిలబడి మత సామరస్యాన్ని చాటారు. అనంతరం ప్రసంగాన్ని కొనసాగించారు.