Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘రాకా’ (Raaka) సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. తాజాగా దర్శకుడు శిబి చక్రవర్తి (Cibi Chakravarthi) ఈ సినిమా ఫుటేజ్‌పై చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చాయి.
సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్‌ను తాను చూశానని, ఆ స్థాయి గ్రాండియర్ చూసి నివ్వెరపోయానని శిబి వెల్లడించారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఇలాంటి విజువల్స్ చూడలేదని, హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్’ (Avatar) రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా గర్వపడేలా అట్లీ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.
సన్ పిక్చర్స్ క్రిప్టిక్ టీజర్ – పెరుగుతున్న ఉత్కంఠ..
ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ కథాంశాన్ని, పాత్రలను గోప్యంగా ఉంచుతూనే వరుసగా విడుదల చేస్తున్న సంకేతాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన క్రిప్టిక్ టీజర్‌లో.. “అసాధ్యంగా అనిపించిన దానిని దాటి.. ఊహించడానికి ధైర్యం చేశాం. దాన్ని ఆర్కైవ్ చేయడానికి ధైర్యం చేశాం. రాకా: ఏ గ్లోబల్ ట్రయంఫ్ (A Global Triumph)” అంటూ క్యాప్షన్ జోడించారు. అయితే ఇది సినిమా కథకు సంబంధించిన కాన్సెప్టా లేక సినిమా సాధించబోయే రికార్డులను ఉద్దేశించినదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
మిస్టరీగా మారిన ’37’..
అంతకుముందు మేకర్స్ విడుదల చేసిన ’37’ అనే సంఖ్య అభిమానుల్లో పలు ఊహాగానాలకు దారితీసింది. 3.7 నిమిషాల నిడివితో కూడిన భారీ గ్లింప్స్ విడుదల కానుందా? లేదా 3 × 7 = 21 సమీకరణంతో అట్లీ పుట్టినరోజైన సెప్టెంబర్ 21న బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నారా? అన్న చర్చలు జోరందుకున్నాయి.
రెండు కాలాల కథ – భారీ తారాగణం..
ఈ సినిమా కథ రెండు భిన్న కాలాల (టైమ్‌లైన్స్) నేపథ్యంలో సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
-
ఆధునిక కాలం: వర్తమాన కాలానికి సంబంధించిన కథలో మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
-
పురాణ వైదిక కాలం: పురాణ కాలం బ్యాక్‌డ్రాప్‌లో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, రష్మిక మందన్న నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో దీపిక గర్భిణిగా, ఆమెను రక్షించే యోధురాలిగా రష్మిక, గిరిజన రాణిగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
-
షారుక్ ఖాన్ కేమియో?: అంతర్జాతీయ షెడ్యూల్‌లో భాగంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూడా ఇందులో ఓ కీలక అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్.
భారీ హైప్ – దర్శకుడి పుట్టినరోజే కీలక అప్‌డేట్?..
దర్శకుడు అట్లీ పుట్టినరోజైన సెప్టెంబర్ 21న ఈ సినిమాకు సంబంధించి అధికారిక గ్లింప్స్ రానుందని ప్రచారం సాగుతోంది. అయితే గతంలోనూ భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు ‘అవతార్’ రేంజ్ అంటూ ప్రచారం చేసుకుని, తీరా థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఈ హైప్‌ను సినిమా ఏ మేరకు నిజం చేస్తుందో తెలియాలంటే రాబోయే టీజర్లు, విజువల్స్ వరకు వేచి చూడాల్సిందే.
