NIA Special Court

NIA Special Court: సంచలన తీర్పు.. 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష!

NIA Special Court: ఉద్యోగాలు, ఇంకా మంచి జీతాల ఇపిస్తాం అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా భారత్‌కు రప్పించి, వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కేసులో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం (NIA Special Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితులుగా ఉన్న 9 మందికి జీవిత ఖైదు (యావజ్జీవ కారాగార శిక్ష) విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషులుగా తేలిన 9 మందిలో 8 మంది బంగ్లాదేశ్ పౌరులే కావడం గమనార్హం. అదనంగా నిందితులందరికీ కలిపి మొత్తం రూ.1.37 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అసలేం జరిగింది? 2019 నాటి కేసు నేపథ్యం..

సెప్టెంబర్ 2019లో హైదరాబాద్ పరిధిలోని జల్‌పల్లి (పహాడీ షరీఫ్) గ్రామంలోని ఒక ఇంట్లో కొందరు మహిళలను బంధించి వ్యభిచారం చేయిస్తున్నారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు దాడి చేశారు. అక్కడ బందీలుగా ఉన్న ముగ్గురు బంగ్లాదేశ్ మహిళలను రక్షించారు. అనంతరం బాలాపూర్‌లోని మహమూద్ కాలనీలోని మరో నివాసంపై దాడి చేసి ఇంకో మహిళను సురక్షితంగా కాపాడారు.
కేసు తీవ్రత, అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా లింకులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగింది. అక్టోబర్ 12, 2019న కేసును రీ-రిజిస్టర్ చేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తును చేపట్టింది.
భారత్‌లో మంచి ఉద్యోగాలు, భారీ ఆదాయం ఇప్పిస్తామని నమ్మించి బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా మహిళలను అక్రమంగా భారత్‌కు తీసుకురావడం.. ఆ తర్వాత వారిని బెదిరించి నిర్బంధించి వ్యభిచారంలోకి దింపడమే ఈ ముఠా పనితీరుగా ఎన్‌ఐఏ గుర్తించింది.
ఎన్‌ఐఏ చార్జ్‌షీట్ – జీవిత ఖైదు పడిన దోషులు వీరే..
2019, 2020 సంవత్సరాల్లో పశ్చిమ బెంగాల్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి నిందితులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. అక్టోబర్ 17, 2020న మొత్తం 12 మంది నిందితులపై (వారిలో ముగ్గురు పరారీలో ఉన్నారు) ఐపీసీ, ఫారెనర్స్ యాక్ట్ 1946, ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్ 1956 కింద పకడ్బందీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
శిక్ష పడిన 9 మంది దోషుల వివరాలు..
  • రూహుల్ అమీన్ ధాలీ
  • మహమ్మద్ యూసుఫ్ ఖాన్ అలియాస్ మహమ్మద్ ఇమ్రాన్
  • బీథీ బేగం అలియాస్ ఖదీజా షేక్
  • ఇమాముల్ గాజీ అలియాస్ మహమ్మద్ రాణా హుస్సేన్
  • మహమ్మద్ అల్ మామూన్
  • సోజిబ్ షేక్
  • సురేష్ కుమార్ దాస్ అలియాస్ సాగర్
  • మహమ్మద్ అబ్దుల్లా మున్షీ అలియాస్ అబ్దుల్ సర్కార్
  • మహమ్మద్ అయూబ్ షేక్

నిందితులపై మోపిన తీవ్రమైన అభియోగాలు రుజువు కావడంతో, దోషులుగా తేల్చుతూ హైదరాబాద్ ఎన్‌ఐఏ కోర్టు సెప్టెంబర్ 17న చారిత్రక తీర్పును వెలువరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *