KTR

KTR: పోలీస్ స్టేషన్ లోపలే నా పీఏ, పీఆర్వోలపై 15 మందితో దాడి.. గుండాలా? మఫ్టీ పోలీసులా?

KTR: హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ స్టేషన్ లోపలే ప్రభుత్వ ఆధ్వర్యంలో గుండాయిజం నడుస్తోంది. ఖాకీల కళ్ల ముందే 15 మంది గుండాలు చొరబడి దాడి చేస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి? రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం రాజ్యమేలుతోంది!” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో తన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ ముదిరాజ్‌లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

పోలీస్ స్టేషన్‌లో ముసుగుల దాడి – ముమ్మాటికీ కుట్ర..

రాజకీయ కక్షతో పెట్టిన కేసులో విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించి, యూనిఫాంలో ఉన్న పోలీసుల సమక్షంలోనే ముసుగులు ధరించిన 15 మంది తన సిబ్బందిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు.
దాడికి దిగినవారు కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలా? లేక మఫ్టీలో ఉన్న పోలీసులకే ముసుగులు వేసి పంపించారా? అని ప్రశ్నించారు. ఈ మొత్తం ఉదంతం వెనుక సీఎం, హోంమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని, దీనిపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఉదయం విచారణకు రమ్మని చెప్పి, చీకటి పడే వరకు కాలయాపన చేసి రాత్రి వేళ ఈ దాడికి పాల్పడటం చూస్తుంటే ముందస్తు కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హైకోర్టు సైతం వారిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కక్ష సాధింపుతోనే ఈ దాడి చేయించారని మండిపడ్డారు.
కేసీఆర్ ఇంటిపై దాడి – ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయరా?..
తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేత, రెండుసార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ నివాసంపై దాడికి తెగబడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలను తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు.
స్టేషన్‌లో దాడికి గురైన బాధితులు స్వయంగా ఫిర్యాదు చేసినా పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదు గంటల పాటు స్టేషన్‌లో బైఠాయించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖ అధికార పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం – కేటీఆర్ హెచ్చరిక..
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను తక్షణమే భద్రపరచాలని, దాడిలో గాయపడిన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లకు రక్షణ కల్పించి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ.. “స్టేషన్ లోపలే పోలీసుల సమక్షంలో ఇలాంటి దాడులు జరుగుతుంటే, రేపు పౌరులను నడిరోడ్డుపై మాబ్ లించింగ్ చేసే రోజులు ఎంతో దూరంలో లేవు” అని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని, ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *