BJP MLA: 

BJP MLA: రూ.3,383 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. రోడ్డుపై బిచ్చగాడిగా మారితే?

BJP MLA: మహారాష్ట్రలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరు.. రూ.3,383 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, లగ్జరీ కార్లు, కమాండోల భద్రత, వేల కోట్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి అధిపతి! నిత్యం ప్రజలు, అనుచరులు ఆయన్ను కలిసేందుకు క్యూ కడతారు. అలాంటి అత్యున్నత హోదాలో ఉన్న ఆ నాయకుడు ఉన్నట్టుండి తన సెక్యూరిటీని, విలాసాలను పక్కనపెట్టి.. గుర్తుపట్టలేనంతగా మేకప్ వేసుకుని రోడ్డుపై చేతులు చాచి భిక్షాటన చేశాడు. ఘాట్‌కోపర్ ఈస్ట్ ఎమ్మెల్యే, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త పరాగ్ షా (Parag Shah) చేసిన ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎవరు ఈ పరాగ్ షా?..

పరాగ్ షా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ‘మ్యాన్ ఇన్‌ఫ్రా’ (Man Infra) సీఈవోగా ఉన్నారు. ఈ సంస్థ విలువ రూ.5,000 కోట్లకు పైమాటే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన దాదాపు రూ.3,383 కోట్ల ఆస్తులను ప్రకటించి రాష్ట్రంలోనే అత్యంత ధనిక అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. గతంలో బీఎంసీ (BMC) కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు.
బిచ్చగాడి అవతారం ఎందుకు ఎత్తారు?..
జైన మత సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువు ‘నమ్రముని’ ఇచ్చిన సలహా మేరకు పరాగ్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. ధనం, అధికారం తెచ్చే గర్వాన్ని దూరం చేసి, నేలపై నిలబడేందుకు తన గురువు ఆదేశించడంతో ఆయన ఈ సాధన చేశారు.తన గన్‌మెన్లు, కార్లు, ఖరీదైన దుస్తులను పక్కనపెట్టి.. ఎవరూ గుర్తుపట్టకుండా ప్రత్యేక మేకప్‌తో చిరిగిన బట్టలు వేసుకుని ముంబైలోని ఘాట్‌కోపర్ వీధుల్లోకి నడుచుకుంటూ వెళ్లారు. కేవలం నిలబడి చూడటమే కాకుండా.. నేరుగా పాదచారులను, చిరు వ్యాపారులను అడుక్కున్నారు. రోడ్డు పక్కనే కూర్చుని బిచ్చమెత్తుకున్నారు.

బిచ్చగాడిగా ఎమ్మెల్యే నేర్చుకున్న జీవిత సత్యాలు:

ఈ అనుభవం తన జీవిత దృక్పథాన్నే మార్చేసిందని పరాగ్ షా స్వయంగా వెల్లడించారు.. “హోదా, డబ్బు ఉన్నప్పుడు మనల్ని కలవడానికి జనం బారులు తీరతారు. కానీ బిచ్చగాడిలా మనం వారి ముందుకు వెళ్లినప్పుడు.. వాళ్లే మనకంటే చాలా ఉన్నతంగా నిలబడతారు. అదే జీవితపు అసలైన వాస్తవం” అని ఆయన పేర్కొన్నారు.
తనను యాచకుడిగా చూసిన ఒక వ్యక్తి రూ.20 ఇచ్చి కడుపునిండా ఏదైనా తినమని చెప్పాడు. మరో సమోసా బండి వద్దకు వెళ్లి ఆకలిగా ఉంది కానీ చేతిలో పైసా లేదని అడగ్గానే.. ఆ చిరు వ్యాపారి ఏమాత్రం ఆలోచించకుండా ఉచితంగా సమోసా చేతిలో పెట్టాడు. రోడ్లపై రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద వ్యాపారి చూపిన ఔదార్యం తన హృదయాన్ని కదిలించిందని షా గుర్తుచేసుకున్నారు.
మేకప్ తీసేసి మళ్లీ అదే వీధుల్లోకి..
తన ప్రయోగం ముగిసిన అనంతరం పరాగ్ షా సాధారణ స్థితికి వచ్చి, మేకప్ తొలగించి ఎమ్మెల్యేగా మళ్లీ అదే ప్రాంతాలకు వెళ్లారు. కాసేపటి క్రితం తమ ముందు బిచ్చగాడిలా చేయి చాచిన వ్యక్తి ఇంత పెద్ద ఎమ్మెల్యే అని ఆ వ్యాపారులు, పాదచారులకు తెలియదు. ఈ విచిత్ర అనుభవాన్ని ఆయన తన గురువుతో పాటు మీడియాతో పంచుకున్నారు. ధనం, అధికార హోదాలు శాశ్వతం కావని, మనుషుల నిజమైన విలువ వారు ప్రదర్శించే దయాగుణంలోనే ఉంటుందని చాటిచెప్పిన ఎమ్మెల్యే పరాగ్ షా వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *