ఉత్తుత్తి అసెంబ్లీలో పదవులు.. నిజమైన సభలో ఇవ్వగలరా?..
బీఆర్ఎస్ వాళ్లు పెట్టిన ఉత్తుత్తి (మాక్) అసెంబ్లీలో దళితుడిని స్పీకర్‌గా పెట్టి, బీసీ బిడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీఎంను చేశారు. అంత ప్రేమ ఉంటే.. చేతుల్లో ఉన్న పని చేయండి. బీఆర్ఎస్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే అసలైన అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నేతగా ప్రకటించాలి అని మహేష్ గౌడ్ సవాల్ విసిరారు.
ఎల్లుండి (సెప్టెంబర్ 16న) జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ స్వయంగా హాజరుకావాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ సభకు వస్తే, గతంలో సస్పెండ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందిగా స్పీకర్‌ను స్వయంగా తామే కోరుతామని స్పష్టం చేశారు.
సభాపతిని కులం పేరుతో దూషించడం దుర్మార్గం..
శాసనసభాపతి (స్పీకర్)ను కులం పేరుతో కించపరిచేలా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా నోరు జారినవి కావని, అది బీఆర్ఎస్ డీఎన్ఏలోనే ఉన్న దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
దళిత బిడ్డలు ఆందోళన చేసి నడిచిన నేలను పేడనీళ్లతో శుద్ధి చేయడం బీఆర్ఎస్ ఫ్యూడల్ భావజాలానికి పరాకాష్ట అని విమర్శించారు. దొరల తరాన్ని ప్రజలు ఇప్పటికే ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని, కేసీఆర్ తన పాలసీలను, ఆలోచనలను ముందుగా శుద్ధి చేసుకోవాలని చురకలంటించారు.
ఉద్యమంలో దళిత కార్డు.. అధికారంలో ద్రోహం..
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితుల పేరును కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని, అధికారంలోకి వచ్చాక దళిత కవులు, కళాకారులను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలపై, 2003 డాక్యుమెంట్‌పై బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలవడానికే హుజూరాబాద్‌లో ‘దళితబంధు’ తెచ్చారని, కేవలం అంబేడ్కర్ విగ్రహాలు ఆవిష్కరించినంత మాత్రాన ఆయన ఆశయాల వారసులు కాలేరని తేల్చిచెప్పారు.
పార్టీ అంతర్గత అంశాలపై వివరణ..
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారని, ఆమె స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ను నియమించే అంశంపై అధిష్ఠానమే తగిన నిర్ణయం తీసుకుంటుందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక మంత్రి కొండా సురేఖను పార్టీ అధిష్ఠానం పిలిపించిందన్న ప్రచారంపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.