Hanuman Ansh

Hanuman Ansh: కేవలం ₹2 కోట్ల బడ్జెట్.. బాక్సాఫీస్ వద్ద ₹200 కోట్ల సునామీ!

Hanuman Ansh: భారతీయ సినీ చరిత్రలో ఎవరూ ఊహించని అద్భుతం బాక్సాఫీస్ వద్ద ఆవిష్కృతమైంది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేదు, భారీ ప్రమోషన్లు లేవు.. కేవలం రూ. 2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక చిన్న ఆధ్యాత్మిక సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత స్ఫూర్తితో తెరకెక్కిన భక్తి ప్రధాన సినిమా  ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) ఏకంగా ₹200 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి సరికొత్త రికార్డులను తిరగరాసింది. రూ. 10 లక్షల ఓపెనింగ్‌తో మొదలైన ఈ సినిమా.. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది.

రూ. 10 లక్షల నుంచి ₹200 కోట్ల వరకు – అద్భుత ప్రయాణం..

ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా తొలి రోజు కేవలం రూ. 10 లక్షల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొదటి రెండు వారాల్లో సాధారణంగానే సాగినప్పటికీ, మూడో వారం నుంచి ప్రేక్షకుల మౌత్ పబ్లిసిటీతో కలెక్షన్లు ఊహించని రీతిలో పుంజుకున్నాయి. 24వ రోజున రూ. 12.75 కోట్లు, 32వ రోజున ఏకంగా రూ. 22.75 కోట్ల కలెక్షన్లతో ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ చేసింది. 4వ వారంలో రూ. 61 కోట్లు, 5వ వారంలో ఏకంగా రూ. 90 కోట్లు కొల్లగొట్టింది.
రిలీజైన 36వ రోజున (శుక్రవారం) అత్యధికంగా రూ. 10.50 కోట్ల వసూళ్లు సాధించి, థియేటర్లలో ఉన్న ‘మీర్జాపూర్: ది మూవీ’ (రూ. 9.50 కోట్లు), అక్షయ్ కుమార్-సైఫ్ అలీ ఖాన్‌ల క్రైమ్ థ్రిల్లర్ ‘హైవాన్’ (తొలి రోజు రూ. 3 కోట్లు)లను కూడా దాటేసి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇండియా వ్యాప్తంగా నెట్ వసూళ్లు రూ. 175 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 207 కోట్లను దాటింది. పెట్టిన బడ్జెట్‌పై 100 రెట్లకు పైగా రాబడిని (ROI) అందించి గతంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.
అసిస్టెంట్ డైరెక్టర్‌ నుంచి బాబా పాత్రలోకి..
ఈ సినిమా విజయం వెనుక ఒక ఆసక్తికరమైన నిజ జీవిత సంఘటన ఉంది..
  • ప్రధాన పాత్రలో నీమ్ కరోలి బాబాగా నటించిన శోభినావ్ సత్య అసలు నటుడే కాదు. ఆయన ఈ సినిమాకి సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
  • అనుకోకుండా అసలు హీరో అనారోగ్యం పాలవడంతో, దర్శకుడు విశాల్ చతుర్వేది దాదాపు 5 గంటల పాటు శోభినావ్ సత్యకు ఆడిషన్ నిర్వహించి ఈ పాత్రకు ఎంపిక చేశారు. తెరపై ఆయన జీవించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.
  • విహాన్ షెడ్గే, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ కే రస్తోగి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మూడు భాగాలుగా రాక – హోంబలే ద్వారా గ్లోబల్ రిలీజ్:

ఈ సినిమా కేవలం ఒక భాగానికే పరిమితం కాదని, మూడు భాగాలుగా రానుందని సహ నిర్మాత నమ్రతా సింగ్ వెల్లడించారు. ఈ సినిమా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ అంతర్జాతీయంగా విడుదల చేస్తోంది. రాబోయే మూడో భాగంలో దివంగత ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, హాలీవుడ్ స్టార్ నటి జూలియా రాబర్ట్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల జీవితాలపై నీమ్ కరోలి బాబా చూపిన ఆధ్యాత్మిక ప్రభావాన్ని మరింత గ్రాండ్‌గా చూపించబోతున్నారు.

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ‘హనుమాన్ అంశ్’.. సరైన కంటెంట్, భక్తి భావన ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *