Chandrababu

Chandrababu: అమరావతి పేరు లడఖ్ వరకు వినిపిస్తుంది!

Chandrababu: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉండవల్లిలోని సీఎం నివాసంలో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు, కేంద్ర నిధుల మంజూరుపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు కలిసి ప్రారంభించారు. అదే వేదిక నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మరో 9 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే వైద్య విప్లవం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ పాలన వల్లే ఇంత వేగంగా వైద్య మౌలిక వసతులు సాధ్యమయ్యాయని సీఎం తెలిపారు. రూ. 249 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా 9 క్రిటికల్ కేర్ యూనిట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

 

ఎంబీబీఎస్ సీట్లలో భారీ పెరుగుదల..
గతంలో దేశవ్యాప్తంగా కేవలం 51 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవని, ప్రధాని మోదీ నేతృత్వంలో అవి ఏకంగా 1.18 లక్షలకు పెరిగాయని గుర్తుచేశారు. ప్రతి రాష్ట్రానికి ఎయిమ్స్ (AIIMS) మంజూరు చేయగా, మంగళగిరి ఎయిమ్స్ నేడు దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందని కొనియాడారు.

 

రూ.5 లక్షల ఉచిత వైద్య బీమా..
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందుతోందని, కేంద్ర సహకారంతో భారత్ సంపూర్ణ ‘ఆయుష్మాన్ భారత్’గా మారుతోందని పేర్కొన్నారు.

అమరావతిలో ‘క్వాంటమ్ బయో వ్యాలీ’ – హైటెక్ భవిష్యత్తు..

క్వాంటమ్ టెక్నాలజీకి కేరాఫ్
అమరావతి భవిష్యత్తును కేవలం రాజధానిగానే కాకుండా ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతిలోనే ప్రారంభించనున్నామని వెల్లడించారు.
డేటా సెంటర్లు & బయో వ్యాలీ
క్వాంటమ్ కంప్యూటింగ్‌తో పాటు భారీ డేటా సెంటర్లు అమరావతికి రాబోతున్నాయని, ఇక్కడ అత్యాధునిక ‘క్వాంటమ్ బయో వ్యాలీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీ ఫార్మా ఉత్పత్తులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయని, రాబోయే రోజుల్లో హెల్త్‌కేర్ రంగంలో ‘సంజీవని ప్రాజెక్ట్’ గేమ్ ఛేంజర్‌గా నిలవనుందని చెప్పారు.
2047 విజన్
2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరాలని, అదే సమయంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం పునరుద్ఘాటించారు. అమరావతి ఘనకీర్తి లడఖ్ వరకు వినిపించేలా అభివృద్ధి చేసి చూపిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *