Prakasam: కన్నబిడ్డ అనుమానాస్పద మృతిపై నిజాలు తేల్చాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏడు నెలలుగా అలుపెరగని పోరాటం చేసిన ఒక పేద తల్లి పోరాటం విషాదాంతమైంది. ప్రకాశం జిల్లాకు చెందిన తౌషిక్ తల్లి మౌలాబి, కుమారుడు చనిపోయిన స్కూల్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు కుటుంబ సభ్యులను, బంధువులను కన్నీరుమున్నీరు చేస్తోంది.
కొడుకు మరణం – ఏడు నెలల న్యాయపోరాటం..
శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న తౌషిక్ గత ఫిబ్రవరి 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తౌషిక్‌ది ఆత్మహత్యగా పేర్కొన్నప్పటికీ, తల్లిదండ్రులు మాత్రం ఆ వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. తమ కుమారుడిని స్కూల్ యాజమాన్యమే హత్య చేసిందని, సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపిస్తూ నిరసనలకు దిగారు.
కన్నీటి నిరసనలు..
తన బిడ్డ చావుకు గల అసలు కారణాలు బయటపడాలని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపనని తల్లి మౌలాబి గత ఏడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ, వరుస ఆందోళనలు చేపట్టారు.
స్కూల్ వద్దే ఆత్మహత్యాయత్నం – చికిత్స పొందుతూ మృతి..
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌలాబి, రెండు రోజుల క్రితం నేరుగా ఆ స్కూల్ వద్దకే వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
కుటుంబ సభ్యుల కన్నీరు – సమగ్ర విచారణకు డిమాండ్
తొలుత కుమారుడు, ఇప్పుడు అతని కోసం పోరాడిన తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం పూర్తిగా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తౌషిక్ మృతిపై ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాలని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
