Revanth Reddy: మనిషికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా.. చదువు లేకపోతే సామాజికంగా వెనుకబడిపోతారు. పేదరికాన్ని జయించి మన తలరాతను మార్చగల ఏకైక ఆయుధం విద్యే! అంటూ తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, సాగునీటి రంగాలకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ప్రకటిస్తూ, భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర విద్యా వ్యవస్థలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులు, బడ్జెట్ కేటాయింపులను సీఎం సభకు వివరించారు. పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేరన్న విమర్శలకు బదులిస్తూ.. పేద పిల్లలకు నాణ్యమైన చదువు అందాలన్న అమితమైన ఆసక్తితోనే విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నానని సీఎం తెలిపారు.
బడ్జెట్‌లో ఏటా పెంపు – 15 శాతం కేటాయింపే టార్గెట్..
-
2023-24 (గత ప్రభుత్వం): రూ. 18,955 కోట్లు (6.53%)
-
2024-25: 7 శాతానికి పైగా వ్యయం
-
2025-26: రూ. 23,729 కోట్లు (8 శాతానికి పైగా)
-
2026-27: రూ. 27,663 కోట్లు
-
గత మూడేళ్లలో విద్యాశాఖ కోసం అదనంగా రూ. 7,554 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు.
రికార్డు సమయంలో టీచర్ల భర్తీ – విద్యా కమిషన్ ఏర్పాటు..
బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలోనే తమ ప్రభుత్వం పయనిస్తోందని సీఎం అన్నారు. పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వేసిన పునాదులపైనే దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు నడుస్తున్నాయని గుర్తుచేశారు. సీపెక్ సర్వేలో తేలిన వాస్తవాల ఆధారంగా, సంప్రదాయ ఆలోచనల నుంచి విద్యార్థులను బయటకు తెచ్చి నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్‌మెంట్) అందించడం ద్వారా ‘జెన్-జీ’, రాబోయే తరాలను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
