Chandrababu

Chandrababu: ఆఫీసుల్లో కూర్చుంటే సమస్యలు తీరవు.. ప్రజల సంతృప్తే ముఖ్యం!

Chandrababu: ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. చిట్టచివరికి ఒక సామాన్యుడి ముఖంలో సంతృప్తి కనిపించనప్పుడు ఆ పాలనకు అర్థమే ఉండదు. సరిగ్గా ఇదే విషయాన్ని కలెక్టర్ల సదస్సులో చాలా సూటిగా, స్పష్టంగా గుర్తుచేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏసీ గదులకే పరిమితం కాకుండా నేరుగా పల్లెబాట పట్టినప్పుడే అసలైన క్షేత్రస్థాయి సమస్యలు తెలుస్తాయని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను తీర్చడం, పాలనలో సరికొత్త టెక్నాలజీని వాడటం, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచడం అనే అంశాలపై ఆయన కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు.
నెలకు నాలుగుసార్లు పల్లెలకు వెళ్లాల్సిందే..
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే దరఖాస్తులను మొక్కుబడిగా కాకుండా, అర్జీదారుడికి పూర్తి సాంత్వన కలిగేలా పరిష్కరించాలి. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి అధికారులు ప్రతి నెలా కనీసం నాలుగుసార్లు గ్రామాల్లో పర్యటిస్తే మెజారిటీ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి.అధికారులు ఎప్పుడు, ఏ గ్రామానికి వెళ్లారనే వివరాలను పక్కాగా రికార్డు చేయాలని సీఎం ఆదేశించారు.
పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)..
జీఎస్టీ విభాగంలో ఏఐ వాడకం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అదే తరహాలో కోర్టుల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కేసులను త్వరగా పరిష్కరించేందుకు ‘లీగల్ ఏఐ స్టాక్’ తీసుకురాబోతున్నాం.
ప్రభుత్వ విభాగాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేయాలి. ప్రతి శాఖలో లోతైన టెక్నాలజీని (Deep Tech) జోడించడం ద్వారా అదనపు అభివృద్ధి సాధించడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు.
పనిచేసే వారికి ప్రోత్సాహం.. లేకపోతే పక్కకే:
ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో మంచి అభిప్రాయం రావాలి. లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. బాధ్యతగా పనిచేసే ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహించండి, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టండి.
వార్డు సచివాలయాల సిబ్బందిలో కొందరిపై ఎక్కువ భారం, మరికొందరికి తక్కువ పని ఉండటం గమనించాం. అందరికీ న్యాయమైన జాబ్ ఛార్ట్ సిద్ధం చేసి పనిని సమానంగా విభజించాలి. క్షేత్రస్థాయి పరిశీలనలు వేగంగా చేసేందుకు వీలుగా ప్రతి కార్యాలయానికి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ (EV Cycle) అందిస్తామని సీఎం ప్రకటించారు.

ఇదే సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, జిల్లాల వారీగా ఆర్థిక ప్రగతితో పాటు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల స్పందన ఎలా ఉందో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కలెక్టర్లను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *