Vinayaka Temple: సాధారణంగా వినాయకుడు అనగానే మనకు గుర్తొచ్చేది గజముఖం, పెద్ద బొజ్జ, వంపు తిరిగిన తొండం. కానీ వినాయకుడు తొండం లేకుండా, అచ్చం మనలాగే మనిషి ముఖంతో, చిన్న పిల్లాడి రూపంలో దర్శనమిచ్చే అద్భుతమైన గుడులు మన దేశంలో ఉన్నాయని చాలామందికి తెలియదు. రాబోయే వినాయక చవితి వేళ ఈ రెండు అరుదైన ఆలయాల గురించి తెలుసుకోండి.
తమిళనాడులోని ‘నరముఖ ఆది వినాయకుడు’ (తిలతర్పణపురి)
తమిళనాడులోని తిలతర్పణపురి గ్రామంలో ఉన్న ముక్తీశ్వరర్ ఆలయ ప్రాంగణంలో ఈ వినాయకుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి విగ్రహానికి గజముఖం, తొండం ఉండవు, సాక్షాత్తూ మనిషి ముఖంతో ‘బాల గణపతి’ రూపంలో దర్శనమిస్తాడు. అందుకే ఈ స్వామిని ‘ఆది వినాయకుడు’ లేదా ‘నరముఖ గణపతి’ అంటారు.
రాముడి పితృ తర్పణాల క్షేత్రం..
దశరథ మహారాజు మోక్షం కోసం శ్రీరాముడు దేశమంతా పిండ ప్రదానాలు చేసినా శాంతి లభించకపోవడంతో శివుడి ఆదేశం మేరకు ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి నువ్వుల నీటితో పితృ తర్పణం వదిలాడట. రాముడు పెట్టిన నాలుగు పిండాలు ఇక్కడ శివలింగాలుగా మారాయని చెబుతారు. కాశీ, గయ, రామేశ్వరం వంటి ఏడు మోక్ష ధామాలతో సమానమైన పవిత్ర స్థలంగా దీనికి గుర్తింపు ఉంది.
నమ్మకం & పూజలు..
పితృదోషాలతో బాధపడేవాళ్లు ఇక్కడ తర్పణాలు వదిలితే ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి సంకటహర చతుర్థి రోజున అగస్త్య మహర్షి స్వయంగా ఈ నరముఖ గణపతిని పూజిస్తారని స్థల పురాణం చెబుతోంది. విద్యార్థులకు మంచి బుద్ధి, కుటుంబంలో ప్రశాంతత కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు.
ఎలా వెళ్లాలి?
ఈ ఆలయం తమిళనాడులోని ప్రసిద్ధ కూతనూరు సరస్వతి గుడికి సుమారు 3 కిలోమీటర్లు, తిరునల్లార్ శనీశ్వర ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జైపూర్‌లోని ‘గఢ్ గణేష్’ (తొండం లేని చిన్నారి రూపం)
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఆరావళి కొండల పైభాగంలో కొలువై ఉన్న ‘గఢ్ గణేష్’ ఆలయంలోనూ వినాయకుడికి తొండం ఉండదు. ఇక్కడ గణపతి చిన్న బాలుడి రూపంలో (పురుషాకృతి) దర్శనమిస్తాడు. కొండపై కిరీటంలా కనిపించే ఈ ఆలయానికి వెళ్లాలంటే ఏడాదిలోని రోజుల సంఖ్యకు ప్రతీకగా ఉండే 365 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
జైపూర్ నగరానికంటే పాతది..
18వ శతాబ్దంలో జైపూర్ నగరాన్ని నిర్మించడానికి ముందే మహారాజా సవాయ్ జైసింగ్-II అశ్వమేధ యాగం చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. వినాయకుడి ప్రతిష్ఠ తర్వాతే నగర శంకుస్థాపన పనులు మొదలుపెట్టారు.
బైనాక్యులర్‌తో మహారాజు దర్శనం..
ఆలయంలోని విగ్రహాన్ని ఎంత ప్రత్యేకంగా ప్రతిష్ఠించారంటే.. సిటీ ప్యాలెస్‌లోని చంద్రమహల్ నుంచి నేరుగా ఈ గుడి కనిపిస్తుంది. మహారాజు ప్రతిరోజూ ఉదయం ప్యాలెస్ పైనుంచి బైనాక్యులర్ (దూరదర్శిని) ద్వారా గణపతిని చూసి రోజూవారీ పనులు మొదలుపెట్టేవారట.
సమయాలు..
కొండపై నుంచి గులాబీ నగరం జైపూర్ మొత్తం కనువిందు చేస్తుంది. సాధారణ రోజుల్లో ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు.
గజముఖంతో కాకుండా ఇలా పసిపిల్లాడి రూపంలో, మనిషి ముఖంతో తొండం లేకుండా కొలువైన ఈ ఆలయాలు భక్తులకు నిజంగా సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతినిస్తాయి.
